మనోహరాబాద్, మే 17: కాంగ్రెస్ పాలనలో రైతులకు తిప్పలు తప్పడం లేదు. దొడ్డు వడ్లు, సన్న వడ్లు పండించిన రైతన్నలు ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. బోనస్ దేవుడెరుగు కనీసం పండించిన ధాన్యాన్ని కొనేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధిక డిమాండ్ ఉన్న సన్న వడ్లకు సైతం కష్ట కాలం దాపురించింది. కొనుగోలు కేంద్రాల్లో సన్న వడ్లను అసలే కొనుగోలు చేయకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అకాల వర్షాలకు ఎక్కడ నష్టపోతామన్న భయంతో తక్కువ ధరకే దళారులకు విక్రయిస్తున్నారు. క్వింటాల్ సన్న వడ్లు రూ. 1600 నుంచి రూ. 2000 వరకు విక్రయిస్తున్నట్లు పలువురు రైతులు తెలిపారు.
దొడ్డు వడ్లను తప్ప సన్న వడ్లను అసలే కొనడం లేదు. వారం రోజులు పడుతుందంటున్నారు. అప్పటి వరకు రోడ్లపై ఆరబోసిన వడ్లన్నీ అకాల వర్షానికి నేలపాలవుతున్నాయి. చేసేదేమి లేక దళారులకు క్వింటాల్‌కు రూ. 1600 నుంచి రూ. 2000 వరకు విక్రయించుకుంటున్నాం.
-మహేశ్, రైతు, కొనాయిపల్లి పీటీ
రైతులు పండించిన ప్రతి గింజనూ తప్పకుండా కొనుగోలు చేస్తాం. తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం. రైస్‌మిల్లుల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. రైస్‌మిల్లులకు ఇచ్చిన నిల్వల కంటే రెండు, మూడేండ్లుగా రెట్టింపు ఇచ్చాం. దీంతో సమస్య ఉత్పన్నమైంది. రైతులు అధైర్య పడవద్దు. రెండు రోజులు ఆలస్యమైనా, అకాల వర్షానికి తడిచిన ధాన్యాన్ని సైతం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొనుగోలు చేస్తాం.
-చంద్రశేఖర్‌రెడ్డి, తహసీల్దార్, మనోహరాబాద్