సిద్దిపేట, మే 27( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆరుగాలం కష్టపంచిన వడ్లు అకాల వర్షానికి తడిసి ముద్ద కావడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ఉమ్మడి మెదక్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. వడ్లు వాననీటికి కొట్టుకుపోయాయి. కండ్ల్లముందే ధాన్యం పాడవడంతో రైతులు రోదించారు. ఈదురు గాలులు అకాలవర్షం, పిడుగుపాటుకు పలుచోట్ల కాడెద్దులు, పాడిగేదెలు చనిపోయాయి. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా మంగళవారం రాత్రి బలమైన గాలులతో పాటు భారీ వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాలు చెరువులను తలపించాయి.
ఏ సెంటర్‌కు వెళ్లినా రైతులు కన్నీరు మున్నీరవుతూ కనిపించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు సరాసరిగా 61 శాతం మాత్రమే వడ్లు కొనుగోలు పూర్తి చేశారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో కలిపి మొత్తం 9,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు కేవలం 5,89,000 ధాన్యం సేకరించారు. సిద్దిపేట జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యానికి 2,54,000 మెట్రిక్ టన్నులు కొన్నారు. 63 శాతం మేర పూర్తి అయింది.మెదక్ జిల్లాలో 3.50 లక్షల ధాన్యం సేకరణకు 2,40,000 మెట్రిక్ టన్నులు కొన్నారు.
ఈ జిల్లాలో 68 శాతం కొనుగోళ్లు పూర్తి చేశారు. సంగారెడ్డి జిల్లాలో 2,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, 95,000 మెట్రిక్ టన్నులు సేకరించారు.ఈ ఈ జిల్లాలో 43 శాతం కొనుగోళ్లు పూర్తి చేశారు. బుధవారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హైదరాబాద్ నుంచి నేరుగా చిన్నకోడూరులో కొనుగోలు కేంద్రంలోని రైతుల వద్దకి వచ్చి తడిసిన ధాన్యం పరిశీలించి రైతులను ఓదార్చారు. ఉన్నతాధికారులతో అక్కడి నుంచి ఫోన్లో మాట్లాడారు. రైతులకు ఇబ్బంది కలగకుండా తడిసిన ధాన్యం పూర్తిగా లిప్ట్ చేయాలని అధికారులకు సూచించారు. రైతులను ఓదార్చారు. బెజ్జంకి మండలంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులను ఓదార్చారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని ఆయా కొనుగోలు కేంద్రాల్లోని రైతులు ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు.

గజ్వేల్ మార్కెట్లో కొట్టుకుపోయిన ధాన్యం
గజ్వేల్, మే 27: అకాల వర్షానికి గజ్వేల్ వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం కొట్టుకపోగా, బస్తాలు తడిసిపోయాయి. ధాన్యం రాశులపై టార్పాలిన్లు కప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. వందలాది కుప్పలు మార్కెట్లో కొనుగోలుకు సిద్ధంగా ఉండగా, మంగళవారం కురిసిన వానకు మొత్తం తడిశాయి. గజ్వేల్ రింగ్ రోడ్డు చుట్టూ ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది. మండల పరిధిలోని శ్రీగిరిపల్లి,అక్కారం, కొడకండ్ల, సింగాటం, అహ్మదీపూర్, కొల్గూర్, దిలాల్పూర్, బెజుగామ, బయ్యారం, బంగ్లావెంకటాపూర్, ధర్మారెడ్డిపల్లి రింగ్‌రోడ్డుపై ఉన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. తడిసిన ధాన్యం చూసిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కాంటా కావడం లేదు
గజ్వేల్ మార్కెట్లో వడ్లను అమ్ముదామని తెచ్చి పదిహేను రోజులవుతుంది. ఎన్ని రోజులైనా కాంటా కావడంలేదు. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి వడ్లు కొట్టుకుపోయాయి. ఎంతో బాధగా ఉంది. మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్నాం. రాత్రి వానకు చాలా మంది రైతుల వడ్లు కిందకు కొట్టుకపోయాయి. ఇప్పుడు తడిసిన వడ్లను చూసిన అధికారులు ఏమంటారో చూడాలే. తొందరగా కొంటే మళ్ల దుక్కి దున్నుకునే పనిలోకి పోవచ్చు.రు.
-జోగు మల్లేశం, రాజిరెడ్డిపల్లి, గజ్వేల్ మండలం,సిద్దిపేట జిల్లా
రెండు నెలలైన పొద్దుతిరుగుడు కొనలే గజ్వేల్ మార్కెట్‌కు పొద్దుతిరుగుడు విక్రయానికి తెచ్చి రెండునెలలైంది. రెండు నెలలుగా కొనుగోలు చేయకపోతే కవర్ కప్పి ఇక్కడే పెట్టా. రెండు రోజులగా తిరిగి పొద్దుతిరుగుడు కొనుగోలు ప్రారంభించారు. సీరియల్ లైన్ చాలా ఉంది. రాత్రి కురిసిన వర్షానికి భయమైంది. షెడ్ కింద ఉండడంతో ఏమీ తడవలేదు. ఊర్ల కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తాలు చాలా మందివి తడిసిపోయాయి. తొందరగా కొనుగోలు పూర్తి చేయాలి.
-లక్ష్మణ్‌గౌడ్, దిలాల్పూర్, గజ్వేల్ మండలం, సిద్దిపేట జిల్లా

వానకు వడ్లు తడిసినయి
మంగళవారం రాత్రి, ఉదయం కురిసిన అకాల వర్షంతో మారె ట్ యార్డులో పోసిన వడ్లన్నీ తడిసి పోయినాయి. వడ్లను కొనే నాథుడే లేడు. 25 రోజుల కింద మారెట్లో వడ్లు పోసిన. తాలు లేకుండా పట్టిన, అయి నా కొనుగోలు జరుగుత లేవు. సార్లను అడిగితే గోనె సంచులు సరిపడా లేవన్నారు. లారీలు రాకపోవడంతో తూ కం వేసిన వడ్లు పోవడం లేదు. ఇప్పుడేమో వడ్లు తడిసిపోయినయి. మరి ప్రభుత్వం కొం టదో లేదో అని అనుమానంలో ఉన్నాం..
-ఐలయ్య,రైతు, హనుమాన్ నగర్, సిద్దిపేట జిల్లా
కాంటాకు వడ్లు తెచ్చి 27 రోజులైంది
కొమురవెల్లి, మే 27 : తపాస్‌పల్లి ధా న్యం కొనుగోలు కేం ద్రానికి వడ్లు తెచ్చి 27 రోజులు అయ్యింది. కనీసం మమ్మల్ని పట్టించుకున్న నాధుడే లేడు. నిర్వహకులను గన్నీ బ్యాగులు అడిగితే మా ఊరు వాళ్లవి మొత్తం ధాన్యం పోయిన తర్వాతేనే నీకు ఇస్తామంటున్నారు. ధాన్యం పోసి చాలా రోజులైందని అడిగితే నిన్ను ఎవరు పోయిమన్నారని ప్రశ్నిస్తున్నాడు. ప్రభు త్వం సమీపంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మీ ధాన్యాన్ని విక్రయించుకోవచ్చని చెబుతున్నప్పటికి ఇక్కడ మాత్రం పట్టించుకునే వాళ్లే కరువ య్యారు.
– చిప్ప ఉపేందర్, రైతు, ఐనాపూర్
45 రోజులైనా కొనేవారే లేరు
వడ్లు తెచ్చి 45 రోజు లు అవుతుంది. వాటిని పట్టించుకునే వారే లేరు. రాత్రి ఉదయం కురిసిన అకాల వర్షంతో వడ్లన్నీ తడిసి పోయినవి. అధికారులు పట్టించుకోలేదు. గతంలో ఇలాంటి పరిస్థితి లేకుండే, అధికారులు రారు.. వచ్చిన గన్నీ సంచులు ఇవ్వడం లేరు. పంట అమ్ముకోవడం చాలా కష్టమైపోయింది. 45 రోజులుగా మారెట్ లోనే పడిగాపులు కాస్తున్నాం.
-సుదర్శన్ రెడ్డి, రైతు, ఇమాంబాద్
