చేగుంట, నవంబర్ 07: మండలంలోని రుక్మాపూర్ గ్రామంలో కొత్త రకం వరి విత్తనాలు తీసుకున్న రైతులు వరి పంటకు గింజలు రాకపోవడంతో లబోదిబోమంటున్నారు. తమ విత్తన కంపెనీ విత్తనాలు పండిస్తే పంట వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్దతు ధర కన్నా అధిక ధరతో కొనుగోలు చేస్తామని చెప్పడంతో అధిక లాభం వస్తుందని రైతులు వారు చెప్పిన మాటలు నమ్మి పంటను వేసుకున్నారు. ఆశతో సుమారు 40 మంది రైతులు వరి రకం 45, 47 అనే వరి విత్తనాలతో వరి సాగు చేశారు. అయితే పిలకలు వచ్చే సమయానికి చాలా తక్కువగా రావడంతో పాటు చాలా మంది రైతుల పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర నష్టం జరిగిపోయింది.

నష్టపోయిన రైతులు ఈ విషయాన్ని వ్యవసాయ అధికారులకు, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. విత్తనాలను సరఫరా చేసిన సూపర్వైజర్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లభించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట దిగుబడి రాకపోవడంతో లక్షల రూపాయల మేరకు నష్టపోయిన రైతులు ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సుమారు 100 ఎకరాలలో దిగుబడి తగ్గి పంట నష్టం జరిగింది. ప్రభుత్వం, వ్యవసాయ శాఖ సంబంధిత సంస్థలు తక్షణం స్పందించి నష్టపరిహారం అందించే చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
రైతులు నష్టపోయిన విషయమై స్థానిక వ్యవసాయ అధికారి హరి ప్రసాద్ ను వివరణ కోరగా బాధితుల పంటలను పరిశీలించి వాటి నమూనాలను ల్యాబ్ కు పంపించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు సైతం తెలియజేసినట్లు మండల వ్యవసాయ అధికారి హరి ప్రసాద్ పేర్కొన్నారు.