హత్నూర, ఫిబ్రవరి 20: రైతుభరోసా డబ్బులు అకౌంట్లలో జమకావడం లేదని అడిగిన పాపానికి ఆత్మహత్య చేసుకుంటేనే వస్తాయని ఏఈవో సమాధానం ఇస్తున్నాడని సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆరోపించారు. గురువారం కాసాల శివారులోని పొలంలో క్రిమిసంహారక డబ్బాలు చేతపబట్టుకొని ఏఈవో తీరుపై రైతులు నిరసన తెలిపారు. తమతో చులకనగా మాట్లాడుతున్న ఏఈవోను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ… బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సకాలంలో రైతుబంధు డబ్బులు తమ అకౌంట్లల్లో పడ్డాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన రైతుభరోసా డబ్బులు తమ ఖాతాల్లో ఇంకా జమకాలేదన్నారు. దీనిపై కాసాల-దౌల్తాబాద్ క్లస్టర్ ఏఈవో మహేందర్‌ను సంప్రదించగా.. పెట్రోల్ పోసుకొని లేదా పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంటేనే రైతుభరోసా డబ్బులు వస్తాయని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
దేశానికి అన్నంపెట్టే రైతుల పట్ల చులకనగా మాట్లాడుతున్న ఏఈవో మహేందర్‌పై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నిరసనలో రైతులు శ్రీనివాస్‌గౌడ్, ప్రభుకృష్ణ, అఖిల్, మల్లేశం, మహేందర్, కృష్ణ పాల్గొన్నారు. ఈ విషయమై ఏఈవో మహేందర్‌ను వివరణ కోరగా.. తాను అలా మాట్లాడలేదని, ప్రభుత్వం ఎప్పుడు అకౌంట్లో జమ చేస్తే అప్పుడు జమ అవుతాయని చెప్పినట్లు తెలిపారు.