నర్సాపూర్, జూలై 8 : పొలాలకు, ఇంటి అవసరాలకు విద్యుత్ సక్రమంగా రాకపోవడంతో రైతులు సబ్ స్టేషన్‌ను ముట్టడించిన ఘటన మండలంలోని చిప్పల్‌తుర్తిలో సోమవారం చోటుచేసుకుంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. చిప్పల్‌తుర్తిలోని సబ్‌స్టేషన్‌ను సుమారు వందమంది రైతులు, గ్రామస్తులు ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో తీగలు వేలాడుతున్నా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ తీగలకు చెట్ల కొమ్మలు తగలడంతో రోజుకు 20సార్లు ట్రిప్ అవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.
ఆదివారం మద్యాహ్నం ఒంటిగంటకు పోయిన కరెంట్ సోమవారం ఉదయం 9 గంటల వరకు రాకపోవడంతో రైతులు, గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చిందని వెల్లడించారు. అస్తమానం కరెంట్ ట్రిప్ కావడంతో మోటర్లు, ఫ్రిజ్‌లు, టీవీలు కాలిపోతున్నాయని, కరెంట్ సక్రమంగా రాకపోవడంతో పొలాలకు నీరు అందించడం ఇబ్బందిగా మారిందన్నారు. పై నుంచి కరెంట్ బాగానే ఉన్నప్పటికీ సబ్‌స్టేషన్ సిబ్బంది నిర్లక్ష్యంతో నష్టం వాటిళ్లుతున్నదన్నారు. గ్రామాల్లో కట్ పాయింట్ లేకపోవడంతో ఎల్సీ తీసుకుంటే మూడు గ్రామాలకు కరెంట్ నిలిచిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ముట్టడిని తెలుసుకున్న డిఫ్యూటీ ఏడీ అక్కడకు వచ్చి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు, గ్రామస్తులు వెనుతిరిగారు.