చేర్యాల, ఏప్రిల్ 16: కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రైతులు సల్లగ బతికిండ్రు… ఇప్పుడు పంటలు ఎండిపోయి చుక్క నీరు రావడం లేదు. మళ్లీ కేసీఆర్ సార్ రావాలే… రైతులు బాగుపడాలి అని రైతు నాగార్జున అభిప్రాయం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ బహిరంగ సభ విజయవంతం కోసం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో బీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు వాల్పోస్టర్లు ఆవిష్కరించి ముఖ్య నాయకులను కలిసి సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తున్నారు.
బుధవారం మండలంలోని నాగపురి గ్రామానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులకు రైతు నాగార్జున ఎదురుగా వచ్చి వరి పొలం వద్దకు వారిని తీసుకుపోయి ఎండిపోయిన విషయాన్ని తెలియజేశారు. అనంతరం రజోత్సవ సభకు తనవంతుగా రూ.1000 విరాళంగా అందజేసి కేసీఆర్పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లేశం, మాజీ ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, ఏఎంసీ మాజీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, బీఆర్ఎస్ మహిళా మండల అధ్యక్షురాలు మీస పార్వతి, బీఆర్ఎస్ నాయకులు బండమీది కరుణాకర్, నర్సింహులు, సత్యనారాయణ, గ్రామ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.