సిద్దిపేట, మే 16: మనిషి చనిపోతే కనీసం ఇంట్లోకి రానివ్వకుండా అమానవీయంగా ప్రవర్తించిన దారుణ సంఘటన సిద్దిపేటలో చోటుచేసుకుంది. తండ్రి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కొడుకు కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. అద్దె ఇంట్లో అంత్యక్రియలు చేపట్టేందుకు, నివాసంలో ఉండేందుకు ఇంటి యజమాని అనుమతించక పోవడంతో వైకుంఠధామంలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వివరాల్లోకి వెళితే… కామారెడ్డి జిల్లా ఘనపూర్‌కు చెందిన సంతోష్ బతుకుదెరువు కోసం కుటుంబంతో కొన్నాళ్ల కిందట సిద్దిపేటకు వచ్చారు. ఇకడ చిన్నపాటి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయన తండ్రి దత్తయ్య(75) అనారోగ్యంతో బాధపడుతూ ఈనెల 11న సాయంత్రం మృతిచెందాడు. విషయం ఇంటి యజమానికి తెలియడంతో ఇంటి వద్ద మృతదేహం ఉంచేందుకు నిరాకరించారు.
దీంతో 12వ తేదీన ఉదయాన్నే కుటుంబ సభ్యులతో సహా వైకుంఠధామం(శ్రీరామకుంట్ల శ్మశానవాటిక) బయల్దేరి అకడే అంత్యక్రియలు చేశారు. తిరిగి అద్దె ఇంటికి వెళ్దామనుకున్నా, యజమాని నుంచి సరైన స్పందన లేక వైకుంఠధామంలోనే తలదాచుకుంటున్నారు. వైకుంఠధామం వద్ద ఫ్రీజర్లు భద్రపరిచే ఓ షెట్టర్లో సంతోష్, అతడి భార్య, పదేండ్లలోపు ఇద్దరు కుమార్తెలు, తల్లి బికుబికుమంటూ ఉంటున్నారు. విషయం తెలుసుకున్న ఆర్యవైశ్య సంఘాలు బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. తాతాలికంగా నివాస సదుపాయం కల్పించాలని సంతోష్ విన్నవించారు.