చేర్యాల, జూలై 20: వ్యవసాయ సీజన్ ఆసరాగా చేసుకుని పలువురు వ్యక్తులు గ్రామాల్లో కార్లలో వచ్చి షాపుల్లో విక్రయించే దానికి తక్కువ ధరకే పురుగుల మందులు విక్రయిస్తున్నారు. మందులు కొనుగోలు చేసిన రైతులు తమకు బిల్లు ఇవ్వాలంటే బిల్లులు ఇవ్వకుండా కారు స్టార్ట్ చేసుకుని ఉడాయించిన ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని కడవేర్గులో ఆదివారం చోటుచేసుకుంది.
స్థ్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎలాం టి రిజిస్ట్రేషన్ నెంబర్ లేని కారులో పురుగుల నివారణ మందులు తీసుకువచ్చి గ్రామ కూడలిలో ఇద్దరు విక్రయించారు. ప్రస్తుతం వరి నాటు, పత్తి, కూరగాయల పంటలు రైతులు సాగు చేసుకుంటున్న సమయంలో ఎక్కువ మేరకు వివిధ రకాల పురుగుల మందులు, ఎరువులు అవసరం ఉండడంతో అవే మందులను కారులో తీసుకువచ్చి విక్రయిస్తుండగా, మందులు కొంటాం బిల్లులు ఇవ్వాలని పలువురు అడగడంతో నేరుగా కారు స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి ఉడాయించారు.
దీంతో వచ్చినవారు నకిలీ పురుగుల మందులు రైతులకు అంటగట్టి డబ్బులు సంపాదించేందుకు వచ్చారని పలువురు తెలిపారు. బహిరంగ మార్కెట్లో లభించే మందులను తక్కువ ధరలకు ఎలా విక్రయిస్తారని పలువురు రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి నకి లీ పురుగుల మందులు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.