మెదక్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : జిల్లా కేంద్రం మెదక్ నుంచి మీర్జాపల్లి వరకు రైల్వే లైన్ పొడిగించాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు పటోళ్ల శశిధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన రాసిన వినతి పత్రాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు బీఆర్ఎస్ నాయకులు కేఆర్ సురేశ్ రెడ్డి అందజేశారు.
మెదక్ అనాదిగా వెనుకబడిన ప్రాంతమని పటోళ్ల శశిధర్ రెడ్డి వినతిపత్రంలో పటోళ్ల శశిధర్ రెడ్డి తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చర్చి అదేవిధంగా వనదుర్గా భవానీ ఆలయం, దేశంలోనే ఎనిమిదో అత్యంత పెద్దదైన మెదక్ ఖిల్లా తదితర ప్రాంతాలు ఉన్నటువంటి ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాలంటే మెదక్ నుంచి మీర్జాపల్లి వరకు రైల్వే లైన్ అవసరమని తెలిపారు. అక్కన్నపేట నుంచి మెదక్ వరకు రైల్వే లైన్ ద్వారా రాకపోకలకు పెద్దగా సహాయ, సౌకర్యాలు లేనందున దాన్ని మీర్జాపల్లి వరకు పొడిగించాలని కోరారు.