పుల్కల్, ఆగస్టు 29 : కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులకు రూ.2 లక్షలలోపు పంట రుణమాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మొదటి విడతలో రూ.లక్షలోపు, రెండో విడతలో రూ.లక్షన్నరలోపు ఉన్న రైతులకు పంట రుణమాఫీ అయినప్పటికీ మూడో విడతలో రూ. 2 లక్షలలోపు ఉన్న రైతులకు ఇబ్బందులు తప్పలేదు. ఒకే కుటుంబంలో రూ. 2 లక్షల కన్నా ఎక్కువ ఉన్నా వారికి రుణమాఫీ వర్తించలేదు. దీంతో బ్యాంకులు, రైతుల వేదికల వద్దకు కర్షకులు పరుగులు తీస్తున్నారు.
రుణమాఫీ ఎందుకు కాలేదని బ్యాంకు అధికారులను అడిగితే తమకు తెలియదని, వ్యవసాయాధికారులను సంప్రదించాలని సమాధానాలు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం రూ.2 లక్షలలోపు పంటరుణమాఫీ చేస్తదనే ఆశతో ఎదురు చూసినప్పటికీ కొర్రీలు పెట్టి రేషన్‌కార్డును ప్రమాణికంగా తీసుకోవడంతోనే అనర్హులుగా మిగులుతున్నామని కొంత మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతు వేదికల వద్దకు అన్నదాతలు పరుగులు
రూ.2లక్షలలోపు పంట రుణమాఫీ అవుతదేమోననే ఆశ తో రైతులు పట్టాపాసుపుస్తకం, ఆధార్ కార్డు తీసుకొని ఏఈవోల వద్దకు వెళ్తే మీకు సంబంధించిన బ్యాంకు స్టేట్మెంట్ తీసుకొని వస్తే ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెబుతున్నారు. ఈ విషయం తెలియడంతో పంట రుణమాఫీ కాని రైతులు రైతు వేదికల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఏఈవోలు సంబంధిత పత్రాలను స్వీకరిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా పుల్కల్లో..
రూ. 2 లక్షల లోపు పంట రుణమాఫీ కాని రైతులు సంగారెడ్డి జిల్లా పుల్కల్లోనే 513 మంది ఉండగా ఇందులో 281 మందికి సంబంధించి రూ. 2 కోట్ల 3 లక్షల 90వేల 389 మాత్రం పంట రుణమాఫీ అయ్యింది. మిగతా 232 మందిలో కొంత మంది రైతులు అర్హులుగా ఉన్నప్పటికీ రేషన్‌కార్డు ప్రమాణికంగా తీసుకోవడంతో పంట రుణమాఫీ కాలేదు. ఒక కుటుంబం లో ఇద్దరు, ముగ్గురు రూ. 2 లక్షలకు పైగా పంటరుణాలు తీసుకున్నారు. దీంతో వారు పంట రుణ మాఫీకి అనర్హులుగా మిగిలారు.
రైతులను మోసం చేయొద్దు
నాకు బిలాల్పూర్లో 1.10 ఎకరాల భూ మి ఉన్నది. గ్రామంలోని గ్రామీణ వికాస్ బ్యాంకులో రూ. లక్షా క్రాప్‌లోన్ ఉన్నది. మా ఇంటి యజమాని పేరు మీద కూడా 3.15 ఎకరాల భూమి ఉన్నది. ఆయనకు రూ. 1.56 లక్షల అప్పు ఉన్నది. ఇద్దరికీ కలిపి రూ.2.56 లక్షల అప్పు అయ్యింది. దీంతో పంట రుణమాఫీ కాలేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు రెండు లక్షలలోపు పంట రుణమాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. రైతులందరికీ ముందుగా రూ.2 లక్షలను బ్యాంకులో జమచేయాలి. ఆ తర్వాత బ్యాంకులో మిగతా డబ్బులు చెల్లిస్తాం. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేయొద్దు.
– ఇందిరారాణి, మహిళా రైతు, బిలాల్పూర్, కోహీర్ మండలం
అధైర్య పడొద్దు.. ఇంటింటికీ వస్తాం
రూ. 2 లక్షలలోపు పంట రుణమాఫీ కాని రైతులెవరూ అధైర్యపడొద్దు. ఎందుకు రుణమాఫీ కాలేదో.. మీ ఇంటి వద్దకే వచ్చి పత్రాలను పరిశీలించి నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేస్తాం.. అందుకు రైతులకు ఏమై నా ఇబ్బందులుంటే సంప్రదించాలి.
– చైతన్య, వ్యవసాయాధికారి, పుల్కల్ మండలం, సంగారెడ్డి జిల్లా