హుస్నాబాద్, జూన్ 17: గౌరవెల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేసి ట్రయల్ రన్ సైతం చేసి గోదావరి నీళ్లను మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్‌కు తెచ్చిన ఘనత బీఆర్ఎస్ సర్కారుదేనని, మిగులు పనులు పూర్తయితే పార్టీకి పేరొస్తదనే కుట్రలతో పనులను అడ్డుకొని కేసులు వేయించిన ఘనత కాంగ్రెస్ నాయకులదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ తన్నీరు హరీశ్‌రావు అన్నారు. అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో గౌరవెల్లిని పూర్తి చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి 30నెలలైనా 30గజాల కాల్వలు తవ్వలేదని విమర్శించారు. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని శ్రీసాయి ఫంక్షన్హాల్లో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు సర్‌పై అవగాహన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు గురించి సీఎం రేవంత్‌కు అర్థమయ్యేందుకు రెండున్నరేండ్లు పట్టిందని స్వయంగా ఆయనే ఒ ప్పకున్నాడని, మరి గౌరవెల్లిని పూర్తి చేసేందుకు ఎన్నేం డ్లు పడుతుందోనని ఎద్దేవా చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీలు, రైతులను దగా చేసిన రేవంత్
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రైతులను కడపులో పెట్టుకొని చూసుకున్న ఘనత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కే చెందుతుందని హరీశ్‌రావు అన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో ఎస్టీ కార్పొరేషన్‌కు రూ.2,730కోట్లు కేటాయించామని చెప్పి ఉద్యోగుల వేతనాలకు కేవలం రూ.52కోట్లుమాత్రమే ఖర్చు చేశారు తప్పా ఎస్టీలకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌కు 5,403కోట్లు కేటాయించారు తప్పా ఒక్కరికి కూడా రుణం ఇవ్వలేదని, బీసీలకు 1,370 కోట్లు కేటాయించామని ప్రచారం చేసుకున్నారు తప్పా ఒక్కరూపాయి కూడా ఖర్చు చేయలేదని చెప్పా రు.
33కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకోవడం తప్పా వాటి ద్వారా ఒరిగిందేమీ లేదని విమర్శించారు. యాదవులకు గొర్రెలు, మత్స్యకారులకు చేపలు, చేనేతకు సబ్సిడీలు, దళితులకు దళితబంధు లేదు, గౌడన్నలకు బీమా ఎగ్గొట్టిన ఘనత రేవంత్‌రెడ్డికే చెందుతుందన్నారు. వీరందరినీ కన్నబిడ్డల్లా చూసుకున్నది కేసీఆర్ మాత్రమేనన్నారు. మార్చి 22న సిద్దిపేట పర్యటనకు వచ్చిన రేవంత్‌రెడ్డి 45రోజుల్లో రైతుబంధు వేస్తామని ప్రకటించి 85రోజులు గడిచినా ఇవ్వడం లేదన్నారు. పంటలకు బోనస్ బోగస్‌గా మారిందని, కేవలం 7రకాల సన్నాలకే బోనస్ వేస్తామని రైతులకు షాకిచ్చారన్నారు. కాంగ్రెస్ సర్కారు చేస్తున్న కమీషన్ దందాను, హామీలను విస్మరించి చేస్తున్న మోసాలను బీఆర్ఎస్ కార్యకర్తలు ఎప్పటికప్పుడు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. సర్ పేరిట బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానుల ఓట్లతో పాటు అర్హులైన వారి ఓట్లు పోకుండా బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, హన్మకొండ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ సుధీర్‌కుమార్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవీకే రావు, రాష్ట్ర నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, పన్యాల భూపతిరెడ్డి, పేర్యాల రవీందర్రావు, రాయిరెడ్డి రాజిరెడ్డి, సుద్దాల చంద్రయ్య, కొత్త శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌లు, మాజీ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఏడు మండలాల బీఆర్ఎస్ అధ్యక్షుడు, కార్యకర్తలు, నా యకులు పాల్గొన్నారు.

కామారెడ్డి డిక్లరేషన్‌పై మంత్రి పొన్నం మౌనం వీడాలి
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు ఇస్తానన్న 42శాతం రిజర్వేషన్‌పై రాష్ట్ర మంత్రి, బలహీనవర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ ఇప్పటికైనా మౌనం వీడాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేలో బీసీలు 51శాతంగా ఉంటే కాంగ్రెస్ చేసిన సర్వేలో 46శాతం మాత్రమే ఎలా వచ్చిందని, మిగతా ఐదుశాతం బీసీలు ఎటుపోయారని ఆయన ప్రశ్నించారు. బీసీ మంత్రిగా ఉన్న పొన్నం దీనికి సమాధానం చెప్పాలన్నారు.
రాష్ట్రంలోని రైతుల జీవన శైలిని మార్చింది అప్పటి సీఎం కేసీఆర్ అమలు చేసిన రైతుబంధు, రైతు బీమా మాత్రమేనన్నారు. వడ్ల కొనుగోళ్లలో క్వింటాల్‌కు 5కిలోల తరుగు తీసి రూ.వెయ్యి నుంచి రెండు వేల కోట్ల రూపాయలు రైతులను ముంచి దగా చేసింది రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. కేసీఆర్ నెలకొల్పిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలను కనుమరుగు చేసేందుకు యంగ్‌ఇండియా స్కూళ్లతో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మహిళలను కోటీశ్వరులను చేయ డం రేవంత్‌కు సాధ్యం కాదన్నారు. మా ర్పు అనే ఆశలో పడి ప్రజలు మోసపోయి కాం గ్రెస్‌కు ఓటేశారని, ఇప్పుడు చేసిన తప్పును తెలుసుకున్నారన్నారు. ఇది ప్రజాపాలన కాదని, ప్రజావంచన పాలన అని, తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును రికార్డు స్థాయిలో పూర్తి చేయడమే కాకుండా గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు పిలుపునిచ్చారు. గతంలోనూ హుస్నాబాద్ నియోజకవర్గంలో భారీ సంఖ్యలో సభ్యత్వ నమోదు చేశామని, ఈసారి కూడా అధిక సంఖ్యలో చేసి మన ప్రత్యేకతను చాటుకోవాలన్నారు. ప్రతి 20ఏండ్లకు ఒకసారి నిర్వహించే సర్‌పై కార్యకర్తలు పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు. బీఎల్ఏలు అర్హుల ఓట్లు తొలిగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
హుస్నాబాద్‌కు సాగునీళ్లిచ్చిన ఘనత బీఆర్ఎస్దే
నిత్యం కరువుకాటకాలతో అలమటించే హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అప్పటి సీఎం కేసీఆర్ చలవతో పూర్తి స్థాయిలో సాగునీరందించేందుకు కృషి చేశామని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి అందులో నీళ్లు నింపామన్నారు. కాల్వల నిర్మాణం మా త్రం చేయాల్సి ఉండగా రెండున్నరేండ్లయినా తట్టెడు మట్టితీసిన దాఖలాలు లేవన్నారు. కాకతీయ కాల్వ ద్వారా ఎల్కతుర్తి మండలానికి, తోటపల్లి రిజర్వాయర్ ద్వారా చిగురుమామిడి మండలానికి సాగునీరిచ్చామన్నారు. అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు సహకారంతో శనిగరం ప్రాజెక్టు అభివృద్ధితో పాటు మహాసముద్రంగండి తదితర చిన్ననీటి వనరులను నిర్మించుకున్నట్లు వివరించారు. నియోజకవర్గంలో గతంలో 48,200సభ్యత్వాలు ఉన్నాయని, ఈసారి అంతకు మించి సభ్యత్వాలు చేసేందుకు కార్యకర్తలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.