రామచంద్రాపురం, మే 6: మండలంలోని వెలిమెల గ్రామంలోని దళితుల నలభై ఏండ్ల కల సాకారమైంది. వెలిమెల, రంగారెడ్డి జిల్లా కొండకల్ గ్రామాల మధ్య కొన్నేండ్లుగా సర్వే నంబర్ 434లో శివారు భూమి వివాదం ఉండేది. వెలిమెలలో ఎస్సీలకు కేటాయించిన అసైన్డ్ భూమి తమదంటూ ఆ గ్రామస్తులు ఆ భూముల్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. ఈ తంతు దాదాపుగా నలభై ఏండ్లు సాగింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి వెలిమెల ఎస్సీ లబ్ధిదారుల పక్షాన నిలబడి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆరేండ్లుగా ఎమ్మెల్యే పరిష్కారానికి కృషి చేశారు. భూ సర్వే చేసి రెండు గ్రామాల శివారు వివాదాన్ని రెవెన్యూ అధికారులు పరిష్కరించి, 57 మంది లబ్ధిదారులకు తహసీల్దార్ జయరాం నేతృత్వంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రొటెం మాజీ చైర్మన్ భూపాల్‌రెడ్డి ధరణి పాస్‌బుక్కులను శనివారం అందజేశారు.
అంతకుముందు గ్రామంలో రూ.1.63 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్పర్సన్ లలితా సోమిరెడ్డితో కలిసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నలభై ఏండ్లుగా ఉన్న దళితుల సమస్యను పరిష్కరించి పాస్ బుక్కులు అందజేశామన్నారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేశానని, ఆరేండ్లు పట్టిందని అన్నారు. ప్రతిఒక్కరూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. తెల్లాపూర్ మున్సిపాలిటీలో వందల కోట్లతో అభివృద్ధి జరిగిందని, ప్రస్తుతం రూ.85 కోట్ల పనులు జరుగుతున్నాయన్నారు. వెలిమెల గ్రామంలోని రెండు వార్డుల్లో సుమారుగా రూ.9 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. గ్రామంలో బుడగ జంగాల కోరిక మేరకు రూ.20 లక్షలతో కమ్యూనిటీహాల్ నిర్మించామన్నారు.
అన్నివర్గాల వారి అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. అనంతరం ప్రొటెం మాజీ చైర్మన్ భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ తాను ఎంపీపీగా ఉన్న సమయంలో వెలిమెల గ్రామంలో ఎస్సీలకు భూమిని కేటాయించి పొజిషన్ చూపించానని, ఆ తర్వాత రెండు గ్రామాల మధ్య భూ వివాదం చోటు చేసుకోవడంతో రైతులకు ఇబ్బంది కలిగిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే, ప్రొటెం మాజీ చైర్మన్, చైర్‌పర్సన్‌ను గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ రాములుగౌడ్, కౌన్సిలర్లు రవీందర్‌రెడ్డి, సుచరిత కొమురయ్య, బాబ్జీ, రాజు, కోఆప్షన్ సభ్యులు శ్రీపాల్‌రెడ్డి, సుజాత, మాజీ సర్పంచ్ విఠల్‌రెడ్డి, నాయకులు సోమిరెడ్డి, వెంకట్రాంరెడ్డి, మధు, దయాకర్, ఇంద్రారెడ్డి, దయాకర్‌రెడ్డి, ఆర్ఐ శ్రీకాంత్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నలభై ఏండ్లుగా ఎదురుచూస్తున్నాం..
నలభై ఏండ్ల క్రితం వెలిమెల గ్రామంలో మా కుటుంబానికి భూమిని కేటాయించారు. పక్క ఊరోళ్లు ఆ భూమి మాది అం టూ అందులోకి రానివ్వలేదు. చాలా కష్టపడ్డాం. ఎన్నో ప్రభుత్వాలు మారాయి. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత మా భూమి మాకు దక్కింది. ఎమ్మెల్యే బాగా కష్టపడిండు. ఇప్పుడు పాస్బుక్కు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.
– లలిత, వెలిమెల గ్రామం
మా పిల్లలకు మేలు చేసిండ్రు..
మా భూమి మాకు దక్కుతుందో లేదో అని అనుకునేదాన్ని. సచ్చే నాటికైన భూమికి పాస్బుక్కు వస్తే బాగుండేది అనుకున్న. సీఎం కేసీఆర్ సారు మా భూమికి పాస్‌బుక్ ఇచ్చిండు. మస్తు సంతోషంగా ఉంది. మా పిల్లలకు మేలు జరుగుతుంది. ఎన్నో ఏండ్లుగా కొట్లాడుతున్నాం. ఇయాల మా సమస్య తీరింది. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేకు రుణపడి ఉంటాం.
– నాగమ్మ, వెలిమెల గ్రామం