తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ కృషితో జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసుకుంటున్నామని, తద్వారా మన పిల్లలకు వైద్య విద్య అందుబాటులోకి రావడంతో పాటు పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, కోహీర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. సంగారెడ్డి జిల్లా విద్య, వైద్య హబ్‌గా మారుతోందన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా సంఘాలకు వడ్డీ మాఫీ బకాయిలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు అందజేస్తామన్నారు. హరితహారంలో భాగంగా రాష్ట్రంలో 270 కోట్ల మొక్కలు నాటి పచ్చదనం పెంచామని తెలిపారు.
సంగారెడ్డి, మార్చి 6(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి మెడికల్ కాలేజీలో ఈ లైబ్రరీని సోమవారం రాష్ర్ట ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం ఇక్కడి ఎంబీబీఎస్ విద్యార్థులతో మంత్రి ఇంటరాక్ట్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మెడికల్ కాలేజీలు ఇవ్వడం లేదన్నారు. 58 ఏండ్లలో తెలంగాణకు కేవలం మూడు మెడికల్ కాలేజీలు వస్తే, సీఎం కేసీఆర్ పగ్గాలు చేపట్టాక 12 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. పీజీ సీట్లలో ద్వితీయ స్థానంలో ఉన్నట్లు చెప్పారు.
ప్రతి లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లు, ఏడు పీజీ సీట్లు ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే పీజీ సీట్లలో అగ్రస్థానంలో నిలుస్తామని తెలిపారు. చిన్న ఇల్లు కట్టుకోవాలంటేనే ఏడాది, ఏడాదిన్నర సమయం పడుతుందని, అలాంటిది సంగారెడ్డి మెడికల్ కాలేజీ భవనాన్ని ఏడు మాసాల్లో పూర్తి చేశామన్నారు. దీనిని బట్టి చూస్తే ప్రభుత్వ పనితనాన్ని అర్థం చేసుకోవచ్చన్నారు. బీబీనగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటు చేసి నాలుగేళ్లు అయ్యిందన్నారు. అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవన్నారు.
అక్కడి మెడికోలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అక్కడ పేరు గొప్ప..ఊరు దిబ్బ అన్నట్టుగా పరిస్థితి ఉందన్నారు. తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఒకే ఏడాదిలో 8 మెడికల్ కాలేజీలు అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసి ప్రారంభించుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు మూడు మెడికల్ కాలేజీలు మాత్రమే తెలంగాణలో ఉండేవన్నారు. తెలంగాణ స్టేట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన 1956 నుంచి 2014 వరకు కేవలం మూడు మెడికల్ కాలేజీలు వచ్చాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ మెడికల్ కాలేజీలు ఉండేవన్నారు.
58 సంవత్సరాల సమైక్య పాలనలో మూడు మెడికల్ కాలేజీలు వస్తే, 2022లో 8 కొత్త మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారన్నారు. అంతకంటే ముందు మహబూబ్‌నగర్, నల్గొండ, సిద్దిపేట, సూర్యాపేట మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయని, మొత్తం 12మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీని సీఎం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. కార్యక్రమంలో జడ్పీచైర్‌పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, కలెక్టర్ శరత్, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ వైస్‌చైర్మన్ మాణిక్యం, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, బీఆర్ఎస్ నాయకులు బుచ్చిరెడ్డి, డా.శ్రీహరి, విజయేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
ఎంబీబీఎస్ విద్యార్థులతో మంత్రి ముఖాముఖీ
మంత్రి హరీశ్‌రావు: స్టూడెంట్స్ సంగారెడ్డి మెడికల్ కాలేజీ ఎలా ఉంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
విద్యార్థులు: కాలేజీ బాగుంది. వసతులు బాగున్నాయి.
విద్యార్థి హారిక: హారిక కాలేజీ గురించి ఎలా ఫీల్
అవుతున్నావు?
మంత్రి: సర్ నాది సంగారెడ్డిలోని బ్రాహ్మణవాడ. సంగారెడ్డి దవాఖానలో పలుమార్లు చికిత్స పొందా. ఇప్పుడు సంగారెడ్డి మెడికల్ కాలేజీలో చదువుకోవడం ఆనందంగా ఉంది. సంగారెడ్డి కాలేజీలో ఎంబీబీఎస్ సీటు వస్తుందని ఊహించలేదు. ఇక్కడ సీటు రావడం ఎంతో సంతోషంగా ఉంది.
మంత్రి: నీ పేరు ఏంటీ, ఏఊరు?
సాధిక్ విద్యార్థి: సర్ నాపేరు సాధిక్. మాది జహీరాబాద్. ఈ రోజు మీ ముందు నిలబడి మాట్లాడడం సంతోషంగా ఉంది. మా నాన్న టీచర్. నన్ను కష్టపడి చదవించారు. సంగారెడ్డి మెడికల్ కాలేజీలో సీటు రావడం ఆనందంగా ఉంది.
మంత్రి: డాక్టర్ అయ్యి అమెరికా వెళ్తావా? స్థానికంగా ఉండి రోగులకు సేవలు చేస్తావా?
సాధిక్: లేదు సర్ అమెరికా వెళ్లను. జహీరాబాద్‌లోనే ఉండి రోగులకు వైద్యసేవలు అందజేస్తా
మంత్రి: మీరు పీజీ చేస్తారా సాధిక్. ఎందులో పీజీ చేయాలనుకుంటున్నారు?
సాధిక్: సర్ పీజీ చేయాలని అనుకుంటున్నా. ఎందులో అనేది ఇప్పుడు నిర్ణయించుకోలేదు.
మంత్రి: మెడికల్ కాలేజీ సీఎం తీసుకువచ్చారు.అది మీకు తెలుసా?
సాధిక్: సీఎం కేసీఆర్ సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. అతి తక్కువ సమయంలో మెడికల్ కాలేజీ భవనం నిర్మించి కళాశాల ప్రారంభించారు.
మంత్రి: ఇల్లు కట్టుకోవాలనుకుంటే రెండేండ్ల సమయం పడుతుంది. సంగారెడ్డి మెడికల్ కాలేజీ భవనాన్ని ఏడు మాసాల్లో పూర్తి చేశాం. బీబీ నగర్లో ఎయిమ్స్ వచ్చి నాలుగేళ్లు అయ్యింది. సరైన సదుపాయాలు లేవు. తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఒకే ఏడాదిలో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించాం. అన్ని వైద్య కళాశాలల్లో పూర్తి సదుపాయాలు కల్పించాం.
మంత్రి: తెలంగాణ ఏర్పాటుకు ముందు ఎన్ని మెడికల్ కాలేజీలు ఉండేవి ఎవరైనా చెబుతారా?
విద్యార్థి అనిల్‌కుమార్: మూడు మెడికల్ కాలేజీలు తెలంగాణలో ఉండేవి.
మంత్రి: తప్పు అనిల్. హైదరాబాద్ స్టేట్‌లో ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీలు ఉండేవి. తెలంగాణ స్టేట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన 1956 నుంచి 2014 వరకు కేవలం మూడు మెడికల్ కాలేజీలు వచ్చాయి. అవి వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్‌కు మెడికల్ కాలేజీలు ఉండేవి. 58 సంవ్సత్సరాల్లో మూడు మెడికల్ కాలేజీలు వస్తే, 2022లో 8 కొత్త మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారు. అంతకంటే ముందు మహబూబ్‌నగర్, నల్గొండ, సిద్దిపేట, సూర్యాపేట మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. మొత్తం 12
మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో
ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీని సీఎం ఏర్పాటు చేస్తున్నారు.
మంత్రి: మెడికల్ కాలేజీలో విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, డెడ్‌బాడీలు వచ్చాయా?
అనిల్‌కుమార్: ఏమీ ఇబ్బందులు లేవు సర్. డెడ్‌బాడీలు వచ్చాయి. సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన నేను సంగారెడ్డి మెడికల్ కాలేజీలో చదవడం ఆనందంగా ఉంది.
మంత్రి: లైబ్రరీలో బుక్స్ ఉన్నాయా?
విద్యార్థులు: లైబ్రరీలో బుక్స్లేవు సర్
మంత్రి: రెండు వారాల్లో మీకు అవసరమైన బుక్స్ అందజేస్తాం. డెడ్‌బాడీస్ అందజేశాం. హాస్టల్ భవనాలు త్వరలోనే నిర్మిస్తాము. హాస్టల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా?
శ్రీవైష్ణవి గొల్ల విద్యార్థి: సర్ నేను హాస్టల్లో ఉంటాను. హాస్టల్లో ఇబ్బందులు లేవు. భోజనం బాగుంది.
మంత్రి: విద్యార్థులు ఎవరూ ర్యాగింగ్‌కు పాల్పడవద్దు. వచ్చే సారి మీతో కలిసి భోజనం చేస్తాను.
పబ్బోజు వెంకటరమణ: సర్ నేను ఎంబీబీఎస్ సీటు కోసం ఐదేళ్లు కష్టపడ్డా. మానాన్న కార్పెంటర్. నన్ను కష్టపడి చదివించారు. ఈ ప్రభుత్వం కారణంగానే నాకు మెడికల్ సీటు వచ్చింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో చాలామంది విద్యార్థులు చదువుకుని ఎంబీబీఎస్ చదువుతున్నారు.
శ్రీఅగర్వాల్: సర్ మాకు ప్లేగ్రౌండ్ కావాలి
మంత్రి: త్వరలోనే మీకు ఇండోర్ స్టేడియం, జిమ్ నిర్మించి ఇస్తాము.
మంత్రి: విద్యార్థులు అందరూ యోగా చేస్తున్నారా?
విద్యార్థులు: లేదు సర్
మంత్రి: విద్యార్థులు ప్రతిఒక్కరు యోగా చేయాలి. యోగా చేయడంతో ఆరోగ్యం బాగా ఉండటంతో పాటు ప్రశాంతంగా చదువు కొనసాగించేందుకు ఉపయోగపడుతుంది.
మంత్రి: ఎంబీబీఎస్ విద్యార్థులు అందరూ ఫ్యామిలీస్ అడాప్షన్ తీసుకున్నారా?
వర్షిత విద్యార్థి: ఫ్యామిలీ అడాప్షన్ తీసుకున్నాను సర్. సంగారెడ్డిలోని మార్క్స్కాలనీలో ఐదు కుటుంబాలు అడాప్షన్ తీసుకున్నాను.
మంత్రి: ఏమైనా జబ్బులు ఉన్నట్లు గుర్తించారా?
వర్షిత: మూడు కుటుంబాల్లో డయాబెటీస్ సమస్య ఉన్నట్లు గుర్తించాను సర్.
సంతోష్ విద్యార్థి: నేను అడాప్ చేసుకున్న ఐదు కుటుంబాల్లో మూడు కుటుంబాల్లో ఇన్ఫెర్టిలిటీ సమస్యలు ఉన్నట్లు గుర్తించాము సర్
మంత్రి: ఇన్ఫెర్టలిటీ సమస్య ఉంది. ప్రభుత్వం దీనిని గుర్తించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాము. రాష్ట్రంలో కొత్తగా మూడు ఇన్ఫెర్ట్టిలిటీ సెంటర్లు ప్రారంభిస్తున్నాం.