మునిపల్లి, ఆగస్టు 1: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో నిబంధనలు ఉల్లంఘించి భూముల డబుల్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముంబయి జాతీయ రహదారికి అతి దగ్గరలో ఉన్న మునిపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని కంకోల్, మేళసంగం, ఖమ్మంపల్లి, గొర్రెగట్టు, పెద్దగోపులారం, అంతారం, పెద్దచెల్మడ గ్రామాల్లో రెవెన్యూ అధికారుల సహకారంతో కొద్దిరోజులుగా డబుల్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు తెలిసింది. మండలంలో గతంలో కొంతమంది రియల్ వ్యాపారులు భూములు కొనుగోలు చేసి మ్యుటేషన్ చేసుకోవడంలో ఆలస్యం చేశారు.
దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు మునిపల్లి తహసీల్దార్‌తో ముందుగా బేరం కుదుర్చుకుని గుట్టుచప్పుడు కాకుండా డబుల్ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నట్లు తెలిసింది. 1 జూలై 2025 రోజున మునిపల్లికి చెందిన ఓ రైతు భూమి మునిపల్లిలో సర్వేనెంబర్ 403/అ/1లో 1.03 ఎకరాలు, 11 జూలై 2025న పెద్దచెల్మడకు సర్వే నెంబర్ 244లో 37 గుంటల భూమి, అంతారంలోని 11 సర్వేనెంబర్‌లోని 2.22 ఎకరాల వక్ఫ్ భూమిని 4 జూలై 2025న ప్రస్తుత తహసీల్దార్ గంగాభవానీ డబుల్ రిజిస్ట్రేషన్ చేశారు. వక్ఫ్ భూమిని రిజిస్ట్రేషన్ చేసే అధికారం లేకున్నా తహసీల్దార్ చేశారు.
పెద్దగోపులారంలో సర్వే నెంబర్ 24లో 3.20 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రయత్నం జరగడంతో సంబంధిత రైతులు గత సోమవారం మునిపల్లి తహసీల్ కార్యాలయానికి వచ్చి, పెద్దగోపులారంలోని 24 సర్వేనెంబర్లో భూములకు డబుల్ రిజిస్ట్రేషన్ చేయవద్దని ఉప తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు. మునిపల్లి మండలంలో డబుల్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా జిల్లా అధికారులు చర్యలు తీసుకోక పోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల మునిపల్లి, పెద్దచెల్మడ, పెద్దగోపులారం గ్రామాల్లో డబుల్ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు పలువురు బాధితులు పక్కా ఆధారాలతో మునిపల్లి తహసీల్ కార్యాలయానికి వచ్చి డబుల్ రిజిస్ట్రేషన్లు చేయవద్దని వనితి పత్రం అందజేశారు.
ముంబై జాతీయ రహదారికి అతి దగ్గరలో ఉన్న భూములనే టార్గెట్ చేసి కొంతమంది రియల్ వ్యాపారులు అధికారులతో బేరం కుదుర్చుకుని డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. దీనికోసం లక్షలాది రూపాయలు రెవెన్యూ అధికారులకు ముట్టజెప్పుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బేరం కుదిరితే మునిపల్లి తహసీల్ కార్యాలయంలో వక్ఫ్ భూములకు సైతం రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు తెలిసింది. మండలంలోని పలు గ్రామాల్లో వక్ఫ్ భూములకు సైతం రిజిస్ట్రేషన్లు చేసినట్లు సమాచారం. వక్ఫ్ భూములు రిజిస్ట్రేషన్‌కు తహసీల్దార్ ఎకరాకు రూ.3 లక్షల వరకు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
మునిపల్లి మండలం గొర్రెగట్టు గ్రామ శివారులోని బుగ్గరామన్న చెరువు భూమిని సైతం గత తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ కొంతమంది రియల్ వ్యాపారులతో చేతులు కలిపి అప్పనంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నీటిపారుదల శాఖ అధికారుల ఆదేశాలను ఉల్లంఘించి చెరువు భూమి రిజిస్ట్రేషన్ చేయడం విశేషం. మునిపల్లి మండలంలో గతంలో పనిచేసిన తహసీల్దార్ ప్రవీణ్ కుమార్‌పై పలు ఆరోపణలు వచ్చాయి. గొర్రెగట్టు బుగ్గరామన్న చెరువు భూములతో పాటు మండల కేంద్రమైన మునిపల్లితో పాటు ఖమ్మంపల్లి, కంకోల్, గొర్రెగట్లు గ్రామాల్లో పెద్ద ఎత్తున డబుల్ రిజిస్ట్రేషన్లు చేసి, భారీగా డబ్బులు వసూలు చేసినట్లు తహసీల్దార్‌పై పలువురు భూబాధితులు ఆరోపించారు. వీటన్నింటిపై జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు, బాధితులు కోరుతున్నారు.