మద్దూరు(ధూళిమిట్ట), డిసెంబర్ 16: నిరుపేద రైతు కుటుంబంపై విద్యుత్ శాఖ అధికారులు ప్రతాపాన్ని చూపించారు. కరెంట్ బిల్లు కట్టడం లేదని ఆ ఇంటికి ఏకంగా కరెంట్ సరఫరా నిలిపివేయడంతో ఆ కుటుంబం రాత్రంతా చీకట్లోనే గడపాల్సిన దుస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే..సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన రైతు కూరెళ్ల చెన్నారెడ్డి తనకున్న నాలుగున్నర ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ లారీ నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు.
చెన్నారెడ్డి ప్రతినెలా ఇంట్లో సుమారు 120 యూనిట్ల విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తున్నాడు. అయితే 200 యూనిట్లలోపు వినియోగదారులకు గృహజ్యోతి కింద ఉచిత కరెంట్ అందిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ చెన్నారెడ్డికి మాత్రం గృహజ్యోతి అమలు కావడం లేదు. ప్రజాపాలనలో గృహజ్యోతి కింద దరఖాస్తు చేసుకున్నప్పటికీ దరఖాస్తు చేసుకోలేదని ఆన్లైన్ చూపిస్తుండడంతో చెన్నారెడ్డిని ప్రభుత్వం గృహజ్యోతికి అనర్హుడని చేసింది.
గృహజ్యోతి కోసం మద్దూరు ఎంపీడీవో కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో కరెంట్ బిల్లు కట్టడం లేదని విద్యుత్ శాఖ అధికారులు ఆదివారం కరెంట్ సరఫరాను నిలిపివేశారు. దీంతో రైతు తన బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో తన ఆవేదనను సెల్‌ఫోన్‌తో వీడియో తీసి స్థానిక వాట్సాప్ గ్రూప్‌ల్లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.
వీడియోలో చెన్నారెడ్డి ఆవేదన..
చూడండి మిత్రులారా.. ఇగో కరెంటోళ్ల ఆగడాలు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం పరిస్థితి జరుగుతుందో..ప్రత్యక్షంగా చూడండి. ఇగో ఇది నా ఇంటి సమస్యనే..బిల్లు కట్టలేదని కరెంట్ కట్ చేసుకపోతుండ్రు. వీలందరూ కలిసి అసలు కాంగ్రెస్ గర్నమెంట్ ఇచ్చిన పథకాల్లో కరెంట్ బిల్లు మాఫీ అని చెప్పిండ్రు..పంట రుణమాఫీ అని చెప్పిండ్రు. రైతుబంధు లేదు, రుణమాఫీ లేదు, కరెంటోళ్లు కూడా కరెంట్ కట్ చేసుకపోయే పరిస్థితులు ఏర్పడుతున్నయి.. బిల్లు కట్టలేదని.
మాకు వచ్చేది 120, 130 యూనిట్ల కంటే ఎక్కువ లేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో 120 యూనిట్లు వచ్చిన కూడా మాకు కరెంట్ బిల్లు మాఫీ కావడం లేదు. ఎంపీడీవో ఆఫీసు చుట్టూ తిరిగినా కరెంట్ బిల్లు మాఫీ అవుతలేదని చెప్పులరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇయ్యాల కరెంటోళ్లు వచ్చి కరెంట్ కట్ చేసుకపోతుండ్రు.. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేటువంటి పరిస్థితి ఇది ఉన్నది. 30 సంవత్సరాలుగా కాంగ్రెస్‌కు సేవలందిస్తున్నా… పట్టించుకున్న నాథుడే లేడు.
ఏ పరిస్థితిలో కూడా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదిక్కడ. మాకున్న జడ్పీటీసీ గానీ, మా నియోజకవర్గ ఇన్చార్జి గానీ మా రైతుల బాధలను పట్టించుకునే పరిస్థితులే లేకుండా పోయినయి. నేను ఇంటిదగ్గర లేని పరిస్థితి చూసి కరెంటోళ్లు కరెంట్‌ను కట్ చేశారు.. అసలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుంది. అని చెన్నారెడ్డి వీడియోలో తన గోడును వెల్లబోసుకున్నాడు. ఈ విషయమై ధూళిమిట్ట ట్రాన్స్‌కో ఏఈ కె.రాజును ‘నమస్తే తెలంగాణ’ ఫోన్లో వివరణ కోరగా.. చెన్నారెడ్డి ఏడాది కాలంగా ఇంటి కరెంట్ బిల్లు చెల్లించకపోవడంతో విద్యుత్ సిబ్బంది కనెక్షన్ కట్ చేసినట్లు తెలిపారు. బిల్లు చెల్లిస్తే పునరుద్ధరిస్తామన్నారు.