జహీరాబాద్/మనూరు, మార్చి 9 : పంట పొలాల్లో ఒకవైపు ఒరిగిన విద్యుత్ స్తంభాలు, చేతికందే ఎత్తులో వేలాడుతున్న కరెంట్ తీగలు, వైర్లను కప్పేస్తూ అల్లుకున్న చెట్లకొమ్మలతో విద్యుత్ ప్రమాదాలు పొంచి ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లోని ఆయా గ్రామాల్లో రోడ్ల ఇరువైపులా, పొలాల గుం డా ఉన్న 11కేవీ, 33 కేవీ, సోలార్ విద్యుత్ స్తంభాలు పూర్తిగా ఒరిగిపోయి పడిపోవటానికి సిద్ధంగా ఉన్నా విద్యు త్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. వీటితో ఏ ప్రమాదాలు జరుగుతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగుడంపల్లి మండలంలోని ఇప్పెపల్లి, మొగుడంపల్లి తదితర గ్రామాలతో పాటు న్యాల్కల్ మండలంలోని హద్నూర్లో షార్ట్ సర్క్యూట్తో ఇటీవల చెరుకు తోటలు కాలిపోయి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. చాలా గ్రామాల్లో విద్యుత్ తీగలు వేలాడుతున్నాయి. మనూరు మండల పలుచోట్ల చేనుల్లో చేతికందే ఎత్తులో విద్యుత్ తీగలు వేలాడుతున్నా విద్యుత్ అధికారులు స్పందించడం లేదు. దీంతో రైతులు చెట్ల కొమ్మలు, కర్రల సహాయంతో విద్యుత్ తీగలకు అడ్డుపెట్టారు. వంగిన విద్యుత్ స్తంభాలు సరి చేయాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని రైతుల ఆరోపించారు.