మెదక్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని, ప్రతి అంశం ఎన్నికల నిబంధనలకు లోబడి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షిషా పేరొన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమీక్ష సమావేశాన్ని ఎస్పీ రోహిణి ప్రియదర్శని, అదనపు కలెక్టర్లు రమేశ్, వెంకటేశ్వర్లుతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ఫిర్యాదులు, అనుమతులు, నామినేషన్ ప్రక్రియలను సులభతరం చేసేలా సీ-విజిల్, ఈ-సువిధ యాప్‌లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
ఈ- సువిధ యాప్ ద్వారా పార్టీ సమావేశాలకు సంబంధించి ముందస్తు అనుమతులను పొందవచ్చని, నామినేషన్ కూడా ఈ-సువిధ యాప్ ద్వారా వేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించదని తెలిపారు. పొలిటికల్ పార్టీలకు చెందిన వారు వారి బూత్ స్థాయి ఏజెంట్ల వివరాలను సమర్పించాలని కోరారు. ప్రచారాలను ఎప్పటికప్పుడు కమిటీల ద్వారా పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యాలు వారిద్వారా పొలిటికల్ పార్టీలకు సంబంధించిన పోస్టర్ నుంచి పాంప్లెట్ వరకు ప్రింటింగ్ చేసే ప్రతిదానిపై ప్రెస్ పేరు, సెల్ ఫోన్ వివరాలను తప్పక అచ్చువేయాలన్నారు.
ఆ దిశగా స్పష్టమైన ఆదేశాలను ప్రింటింగ్ ప్రెస్‌లకు ఇస్తామన్నారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్, మంచినీరు, టాయిలెట్, షామియాన, దివ్యాంగుల కొరకు ర్యాంపులు వీల్‌చైర్ మొదలగు సదుపాయాలను కల్పిస్తామన్నారు. ప్రభుత్వ ఆస్తులపై వాల్ రైటింగ్, పోస్టర్లు, హోర్డింగులు, బ్యానర్లు తదితరాలన్ని 24 గంటలలోపు, అన్ని పబ్లిక్ స్థలాల్లో ఉన్న వాటిని 48 గంటల్లో, ప్రయివేటులో ఉన్న వాటిని 72 గంటలలోపు తొలిగించాలని కోరారు. వెబ్సైట్లో రాజకీయ నాయకుల ఫొటోలు తొలగించాలన్నారు. ప్రభుత్వ వాహనాలు రాజకీయ అవసరాలకు వాడరాదన్నారు. జిల్లాలోని వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.