సంగారెడ్డి, (నమస్తే తెలంగాణ, డిసెంబర్ 13 ) : మలి విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని పది మండలాల పరిధిలోని రెండో విడత ఎన్నికలను ఆదివారం నిర్వహించనున్నారు. ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.శనివారం రాత్రి ఎన్నికలు జరుగుతున్న పంచాయతీలకు పోలింగ్ సామగ్రి, పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. రెండో విడతలో అందోల్ నియోజకవర్గంలోని ఆరు మండలాలు, జహీరాబాద్ నియోజవర్గంలోని నాలుగు మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
10 మండలాల్లో మొత్తం 243 పంచాయతీలు ఉండగా, 14 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 229 పంచాయతీలకు రెండో విడత ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 229 పంచాయతీల్లో మొత్తం 649 మంది అభ్యర్థులు సర్పంచ్‌లుగా పోటీ చేస్తున్నారు. అందోల్ మండలంలో 24 పంచాయతీలకు 68 మంది అభ్యర్థులు, చౌటకూర్‌లో 14 సర్పంచ్ స్థానాలకు 44 మంది, ఝరాసంగంలో 31 స్థానాలకు 76 మంది, కోహీర్‌లో 23 స్థానాలకు 70 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొగడంపల్లిలో 18 సర్పంచ్ స్థానాలకు 60 మంది, మునిపల్లిలో 30 స్థానాలకు 79 మంది, పుల్కల్లో 15 స్థానాలకు 47 మంది, రాయికోడ్‌లో 31 సర్పంచ్ స్థానాలకు 79 మంది, వట్పల్లిలో 21 సర్పంచ్ స్థానాలకు 62 మంది, జహీరాబాద్‌లో 22 పంచాయతీలకు 64 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 229 పంచాయతీల పరిధిలో 1941 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలకు జరగనున్నాయి. వార్డు పరిధిలో స్థానాలకు మొత్తం 4526 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 2,99,746 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రెండో విడత ఎన్నికల కోసం అధికారులు 2164 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. పోలింగ్ సిబ్బంది 3632 మంది ఆదివారం జరిగే రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించనున్నారు. దీంతో పాటు 400 మంది ఎన్నికల అధికారులు, అబ్జర్వర్లు ఎన్నికల విధు ల్లో పాల్గొననున్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల కోసం పోలీసులు గట్టి బందోబస్తు చేశారు. వందకు పైగా సమస్యాత్మాక, అతి సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అదనపు బందోబస్తును ఏర్పా టు చేశారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ శనివారం పోలీసు అధికారులతో మాట్లాడుతూ రెండో విడ త పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సం ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు చేయాలని ఆదేశించారు.

సిద్దిపేట జిల్లాలో 87 జీపీలకు పోలింగ్
సిద్దిపేట, డిసెంబర్ 13: సిద్దిపేట నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో నేడు రెండో విడతలో 87 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2గంటల నుంచి పోలింగ్ కేంద్రాల్లోనే ఓట్ల లెకింపును చేపడతారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ సిబ్బంది ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూరు మండలంలో 28 గ్రామపంచాయతీలు ఉండగా, రామంచ గ్రామపంచాయతీ ఏకగ్రీవం కావడంతో 27 జీపీలకు, నంగునూరు మండలంలో 25 గ్రామపంచాయతీలు ఉండగా, సంతోష్ నగర్,
ఖాతా గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కావడంతో 23 పంచాయతీలకు, సిద్దిపేట అర్బన్ మండలంలో 12 గ్రామ పంచాయతీలు ఉండగా, పాండవపురం ఏకగ్రీవం కావడంతో 11 పంచాయతీలకు, సిద్దిపేట రూరల్ మం డలంలో 15 గ్రామ పంచాయతీలకు 15 పంచాయతీలకు, నారాయణరావుపేట మండలంలో 11 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా 87 జీపీలకు జరిగే ఎన్నికల్లో 350 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 828 వార్డులకు 123 ఏకగ్రీవం కావడంతో 705 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 1,29,981 మంది ఓటర్లు ఓటు హకును వినియోగించుకోనున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 63,745 మంది పురుషులు ఓటర్లు, 66 235 మంది మహిళ ఓటర్లు, ఇతర ఓటర్లు 1 ఉన్నారు.
828 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2436 మంది పీవోలు, ఓపీవోలు విధులు నిర్వర్తించనున్నారు. రెండో విడతలో 21 మంది మైక్రోఅబ్జర్వర్లు, 7 మంది వెబ్ కాస్టింగ్ ఆపరేటర్లు, 28 మంది జోనల్ ఆఫీసర్లు, 59 మంది రూట్ ఆఫీసర్లతో ఇతర అధికారులు ఎన్నికల్లో విధుల్లో పాల్గొనున్నారు. పోలింగ్ కేంద్రాల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. శనివారం ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్ హైమావతి పరిశీలించారు. చిన్నకోడూర్, బెజ్జంకిలో ఆమె పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పోలింగ్ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ ,ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.
