హుస్నాబాద్, డిసెంబర్ 16: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత ఎన్నికలు నేడు (బుధవారం) జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సిద్దిపేట జిల్లా, మండల స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 17వ తేదీ ఉదయం 7గంటల నుం చి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మూడో విడతలో సిద్దిపేట జిల్లా పరిధిలో మొత్తం తొమ్మిది మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి.
ఇందులో హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, చేర్యాల, ధూళిమిట్ట, మద్దూరు కొమురవెల్లి, కొండపాక, కుకునూరుపల్లి మండలాలు ఉన్నాయి. ఆయా మండలాల్లోని 163గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇందులో 13సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 150సర్పంచ్ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతాయి. తొమ్మిది మండలాల్లో మొత్తం 1,432వార్డు స్థానాలు ఉండగా ఇం దులో 249వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 1,182వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని అధికారులు తెలిపారు. 150 సర్పంచ్ స్థానాలకు 587మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా 1,182వార్డు స్థానాలకు 3,308మంది పోటీ పడుతున్నారు.
1,432పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు
సిద్దిపేట జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొత్తం 1,432పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ విధుల్లో మొత్తం 4,434మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తారని జిల్లా అధికారులు తెలిపారు. ఇందులో ఆర్వోలు 195 మంది, పీవోలు 1,718మంది, ఓపీవోలు 2,123మంది, మైక్రో అబ్జర్వర్లు 144మంది, వెబ్‌కాస్టింగ్ సిబ్బంది 21మంది, జోనల్ ఆఫీసర్లు 78మంది, రూట్ ఆఫీసర్లు 155మంది 16వ తేదీ సాయంత్రం నుంచి 17వ తేదీ సాయంత్రం వరకు విధుల్లో ఉండనున్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాల్లో 46కేంద్రాలను క్రిటికల్‌గా గుర్తించారు. ఈ కేంద్రాల్లో అదనంగా 37మంది మైక్రో అబ్జర్వర్లు, 9మంది వెబ్‌కాస్టింగ్ సిబ్బందిని నియమించారు.

2,13,327మంది ఓటర్లు
మూడో విడత ఎన్నికలు జరుగనున్న తొమ్మిది మండలాల్లో మొత్తం 2,13,32 7మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 1,05,265 మంది, మహిళలు 1,08,059మంది, ఇతరులు ముగ్గురు ఓటర్లు ఉన్నారు. అక్కన్నపేట మండలంలో 35,588మంది, చేర్యాలలో 33,282, ధూళిమిట్టలో 13,350, హుస్నాబాద్‌లో 17,935, కోహెడలో 38, 219, కొమురవెల్లి 15,821, కొండపాకలో 26,376, కుకునూరుపల్లి లో15,030, మద్దూరు మండలంలో 17,726మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో పురుషులకంటే మహిళలే ఎక్కువగా ఉండటం విశేషం. అన్ని మండలాల కంటే కోహెడ మండలంలో అత్యధిక ఓటర్లు ఉన్నారు.
163 సెక్షన్ అమలు
పంచాయతీ ఎన్నికలు జరిగే తొమ్మిది మండలాల్లో 163బీఎన్ఎస్ సెక్షన్(144 పాత సెక్షన్) అమలులో ఉంటుందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ సెక్షన్ ప్రకారం ఎన్నికలు జరిగే గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలకు సమీపంలో ఐదుగురికి మించి గుమిగూడి ఉండకూడదు. ఈ సెక్షన్ 15వ తేదీ సాయంత్రం 5గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 7గంటల వరకు అమలులో ఉంటుంది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేసి 163సెక్షన్ అమలు చేస్తున్నట్లు సిద్దిపేట సీపీ విజయ్‌కుమార్ ఇప్పటికే ప్రకటించారు.
ఓటు హక్కు వినియోగించుకోనున్న 91,742మంది
హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో జరగనున్న మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 91,742మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 45,396మంది, మహిళలు 46,346మంది ఉన్నారు. మూడు మండలాల్లో కలిపి మొత్తం 638పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అక్కన్నపేట మండలంలో ఆర్వోలు 41మంది, పీవోలు 363, ఓపీవోలు 417 మంది విధులు నిర్వహిస్తారు. ఇక్కడ నాలుగు జోన్లు, 13రూట్లు ఏర్పాటు చేసి ఆరుగురు అబ్జర్వర్లు విధుల్లో ఉంటారు. హుస్నాబాద్ మండలంలో ఆర్వోలు 16 మంది, పీవోలు 125, ఓపీవోలు 350, జోనల్ ఆఫీసర్లు 3, రూట్ ఆఫీసర్లు నలుగురు విధులు నిర్వహిస్తారు.
జీపీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 16: మూడో విడత ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మెదక్ జిల్లాలోని 21 మండలాల్లో 492 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. తొలి విడతలో అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్, హవేళిఘనపూర్, పాపన్నపేట, పెద్ద శంకరంపేట మండలాల్లో ఈనెల 11వ తేదీన ఎన్నికలు జరిగాయి. రెండో విడతలో చేగుంట, మనోహరాబాద్, మెదక్, నార్సింగి, నిజాంపేట, రామాయంపేట, చిన్న శంకరంపేట, తూప్రాన్ మండలాల్లో ఈనెల 14న ఎన్నికలు జరిగాయి.
బుధవారం మూడో విడతలో నర్సాపూర్, చిలిపిచెడ్, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట, వెల్డుర్తి, మాసాయిపేట మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మండలాల్లో183 గ్రామ పంచాయతీలకు 22 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా.. మిగతా 161 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ స్థానాలకు 512 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 1,528 వార్డు స్థానాలకు 307 ఏకగ్రీవం కాగా, 1,220 స్థానాల్లో (ఒక స్థానానికి నామినేషన్ వేయలేదు) ఎన్నికలు జరగనున్నాయి. వార్డు స్థానాలకు 3,202 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 1,72,804 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 83,531 మంది, మహిళలు 89,269 మంది, ఇతరులు నాలుగురు ఉన్నారు. మొత్తం 1,528 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఎన్నికల సిబ్బంది..
ముడో విడత ఎన్నికల్లో 1,386 మంది ఆర్వోలు (అదనంగా మరో 15 మంది), 1,386 మంది పీవోలు(అదనంగా 139 మంది), పీవోలు 1,506 (ఆదనంగా 151మంది) మందిని ఏర్పాటు చేశారు.