పాపన్నపేట, అక్టోబర్ 15 : భారీ వర్షాలకు మంజీరా నదిలో వరద ఉప్పొంగి సుమారు 60 రోజుల పాటు జల దిగ్బంధంలో చిక్కుకున్న ఏడుపాయల వనదుర్గామాత ఆలయం మరో రెండుమూడు రోజుల్లో తెరుచుకోనున్నది.వరద ప్రవాహం నుంచి ఆలయం తేరుకున్నది. ఆలయం ముందు బ్రిడ్జిపై నుంచి మూడు ఇంచుల మేర మాత్రమే వరద ప్రవహిస్తున్నది. ఆలయ సిబ్బంది మంగళవారం నుంచి ఆలయాన్ని శుభ్రం చేస్తున్నారు. ఆలయంతో పాటు గర్భగుడి,ధ్వజస్తంభం,తదితర ప్రాంతాల్లో విపరీతమైన చెత్తాచెదారం, బురదతో పరిసరాలు పేరుకుపోగా, వాటిని తొలిగించి శుభ్రం చేస్తున్నారు. వరద ఉధృతికి రేకులతో పాటు,క్యూలైన్లు, ఆలయం జాలీలు పూర్తిగా కొట్టుకుపోయాయి.
కింద ఉన్న మార్బుల్స్ సైతం వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. ఆలయ సిబ్బంది శుభ్రం చేసే పనుల్లో నిమగ్నమై ఉన్నారు. రాజగోపురం నుంచి ఆలయం వరకు వెళ్లే దారిలో కొంత మేరకు వరద ప్రవహిస్తుండడంతో పెద్ద ఎత్తున రహదారి పొడుగునా పాకురు పట్టి ఉంది. దాన్ని శుభ్రం చేయడానికి వీలులేదు. వరద ప్రవాహం పూర్తిగా తగ్గిన తర్వాత పాకురు తొలిగింపు పనులు చేపడతారు. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఆగస్టు 14వ తేదీ నుంచి ఏడుపాయల ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకున్నది. అప్పటి నుంచి రాజగోపురంలోనే అమ్మవారికి పూజలు కొనసాగుతున్నాయి. ఈసారి శరన్నవరాత్రి ఉత్సవాలు రాజగోపురంలో నిర్వహించారు. వరదలతో ఆలయానికి భారీగా నష్టం జరిగింది.