నర్సాపూర్: గత ప్రభుత్వ పథకాల కొనసాగింపులో కాంగ్రెస్ సర్కార్ చెప్పేదొకటి చేస్తున్నది మరొకటి. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన ప్రతి పనిని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ మంచినీటిని సరఫరా చేసే మిషన్ భగీరథను కూడా గాలికొదిలేసింది. ఉన్నతాధికారుల అజమాయిషీ లేకపోవడంతో క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా కొనసాగుతున్నది. నర్సాపూర్ మున్సిపాలిటీలో ని రెండో వార్డులో సరఫరా చేసిన భగీరథ నీటిలో వానపాములు (ఎర్రలు) దర్శనమిస్తున్నాయి. వానపాములతోపాటు ఇసుక రావడంతో కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వర్షాకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రభుత్వం, అధికారులు ఓవైపు అవగాహన కల్పిస్తుంటే, మిషన్ భగీరథ తాగునీటిలో వానపాములు రావడం విడ్డూరంగా ఉందంటున్నారు కాలనీవాసులు. శుభ్రమైన నీటిని అందివ్వకుండా ప్రజారోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని పలువురు మండిపడుతున్నారు. కలుషితమైన నీటిని తాగడం వలన రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని, ఇప్పటికైనా మిషన్ భగీరథ ద్వారా శుభ్రమైన నీటిని అందివ్వాలని కాలనీవాసులు చెన్నయ్య తదితరులు కోరుతున్నారు.