సిద్దిపేట, ఫిబ్రవరి 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి):సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. అన్ని మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 402 వార్డులు ఉండగా 1,658 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సిద్దిపేట జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 72 వార్డులకు 326 మంది అభ్యర్థులు, మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో 74 వార్డులకు (మెదక్ మున్సిపాలిటీలో ఒక్క వార్డు ఏకగ్రీవమైంది) 287 మంది అభ్యర్థులు, సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీల్లో 256వార్డులకు 1045మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో401 మంది బీఆర్ఎస్, 402 మంది కాంగ్రెస్, 350 మంది బీజేపీ, 505 మంది ఇతరులు, స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు.మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఆయా పార్టీల, స్వతంత్ర అభ్యర్థుల జాబితాను అధికారులు విడుదల చేసి పార్టీ అభ్యర్థులకు వారివారి పార్టీ గుర్తులు కేటాయించారు. స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సం ఘం సూచించిన గుర్తులను ఆయా జిల్లాలో ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల గుర్తులను ఎన్నికల అధికారులు కేటాయించారు.
ఈ నెల 11న ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఎన్నికలు బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు శిక్షణ నిర్వహిస్తున్నారు.పోలింగ్‌కు 72 గంటల ముందే ఎన్నికల ప్రచారం నిలిపివేయాల్సి ఉంటుంది. ఈనెల 9వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనున్నది. ఎన్నికల ప్రచారానికి కేవలం ఆరు రోజులు ఉంది. 11న ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఏవైన వార్డుల్లో రిపోలింగ్ అవసరమైతే 12వ తేదీన నిర్వహిస్తారు. 13వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ చేపట్టి ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. 14న మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసి 16వ తేదీ ఉదయం 11 గంటలకు నూతన కౌన్సిలర్ల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు. ఏదైనా కారణాల చేత ఆరోజు కాని పక్షంలో 17న నిర్వహించనున్నారు.
సిద్దిపేట జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా ఇక్కడ 88 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దుబ్బాక మున్సిపాలిటీలో 20 వార్డులకు 102 మంది, హుస్నాబాద్‌లో 20 వార్డులకు 92, చేర్యాలలో 12 వార్డులకు 44 మంది బరిలో నిలిచినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. అన్ని వార్డుల్లోనూ ప్రధాన పార్టీ లు బరిలో ఉన్నాయి. ఇందులో అన్ని వార్డులకు బీఆర్ఎస్, కాంగ్రె స్, బీజేపీ అభ్యర్థులు పోటీ చేశారు. చేర్యాల మున్సిపాలిటీలో పోత్తులో భాగంగా బీఆర్ఎస్ సీపీఎం పార్టీకి 3వ వార్డు కేటాయించింది. దీంతో జిల్లాలో 72 వార్డులకు 71 వార్డుల్లో బీఆర్ఎస్, ఒకటి సీపీఎం పోత్తులో నిలబెట్టారు.
సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీలు
సంగారెడ్డి జిల్లాలో 1) అందోల్ జోగిపేట 20 వార్డులకు 63మంది, 2)గడ్డపోతారం లో18వార్డులలో 72 మంది, 3) గుమ్మడిదల 22వార్డుల్లో 94 మంది 4) ఇంద్రేశంలోని 18వార్డుల్లో 76 మంది , 5) ఇస్నాపూర్‌లోని 26 వార్డుల్లో 101 మంది , 6) జిన్నారంలోని 20వార్డులలో 74 మంది,7) కోహీర్‌లోని 16వార్డుల్లో 126 మంది 8) నారాయణ్‌ఖేడ్‌లోని 15 వార్డుల్లో 57 మంది, 9) సదాశివపేటలోని 26వార్డుల్లో 99 మంది, 10) సంగారెడ్డిలోని 38వార్డుల్లో 176 మంది, 11) జహీరాబాద్‌లోని 37వార్డుల్లో 174మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.
మెదక్ జిల్లాలో నాలుగింటికి..
మెదక్ జిల్లాలో 75కు 74 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. మెదక్‌లో 32 వార్డులకు 112 మంది. ఇక్కడ ఒక్క వార్డు ఏకగ్రీవమైంది. తూప్రాన్ మున్సిపాలిటిలో 16 వార్డులకు 64 మంది, రామాయంపేటలో 12 వార్డులకు 48 మంది, నర్సాపూర్‌లో 15వార్డులకు 63 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.