బొల్లారం, అక్టోబర్ 12: ఓవైపు కాలుష్యం.. మరోవైపు డంపుయార్డు కంపుతో జనం బెంబేలెత్తుతున్నారు. ఏండ్లు గడుస్తున్నా డంపుయార్డు సమస్య పరిషారం కావడం లేదు. డంపుయార్డు కంపుతో ప్రజారోగ్యం దెబ్బతింటున్నది. తమ గోస ఎవరికీ పట్టడం లేదంటూ గాంధీనగర్ వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ సమీపంలోని డంపింగ్ యార్డు తమకు శాపంగా మారిందని వాపోతున్నారు. సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డు గాంధీనగర్‌లో 2018 నుంచి డంపుయార్డు కొనసాగుతున్నది. డంపుయార్డు నుంచి వచ్చే దుర్వాసనతో సమీపంలోని కాలనీవాసులు ఇబ్బందులు ఎదురొంటున్నారు.
బొల్లారం మున్సిపాలిటీలో పోగైన చెత్తను డంపింగ్ యార్డులో ఘన వ్యర్థాలను కాల్చివేసే క్రమంలో పెద్ద ఎత్తున వెలువడుతున్న పొగ స్థానికులను ఉకిరిబికిరి చేస్తున్నది. పొగతో స్థానికులు శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు. నిల్వ చేసిన చెత్త వద్ద దోమలు, ఈగలు, క్రిమి కీటకాలు వృద్ధి చెంది అంటువ్యాధులు, చర్మవ్యాధులకు గురవుతున్నట్లు కాలనీవాసులు వాపోతున్నారు. ఇప్పటికే వీటి దుష్పరిణామాలతో కాలనీవాసి ఒకరు మృతిచెందినట్లు తెలిపారు.
ఓ బాలుడికి విపరీతమైన దోమకాట్ల వలన శరీరంపై నల్ల మచ్చలు ఏర్పడి అనారోగ్యం పాలయ్యారని స్థానికులు తెలిపారు. డంపుయార్డు నుంచి వెలువడుతున్న కంపుతో స్థానికంగా జీవించడం కష్టంగా మారిందని, కంపు నుంచి కాలనీని విముక్తి చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. డంపుయార్డు ఆనుకుని శ్మశాన వాటిక ఉంది. దహన కర్మకాండలకు వచ్చే స్థానికులకు డంపుయార్డు దుర్గంధంతో పాటు చెత్తాచెదారం గాలులకు వచ్చి పడుతుండడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతూ దుర్వాసనకు గురి చేస్తున్నాయని చెబుతున్నారు.
గాంధీనగర్ కాలనీవాసులు ఏకమై పలుసార్లు మున్సిపల్ అధికారులకు డంపు యార్డును మరోచోటుకు తరలించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేసినా ఫలితం లేకుండా పోయింది. కాలనీ మహిళలు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. కానీ, ఎలాంటి చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమస్యపై మున్సిపల్ రెవెన్యూ అధికారులతో పాటు ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ను కలిసి గాంధీనగర్ వాసులు ఫిర్యాదు చేశారు. డంపుయార్డు ఘన వ్యర్థాలను త్వరలో గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని రాంకీ పరిశ్రమకు తరలించేలా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. త్వరగా ఈ ప్రకియ చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని మాజీ ప్రజా ప్రతినిధులు, గాంధీనగర్ వాసులు హెచ్చరిస్తున్నారు.