దుబ్బాక, డిసెంబర్ 29: రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుబ్బా క ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా సోమవారం దుబ్బాక నియోజకవర్గంలోని రైతుల సమస్యలను ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. నియోజకవర్గంలో రైతులకు యూరియా కష్టాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారైనా యూరియా దొరుకుతుందో లేదో అనే భయం రైతుల్లో నెలకొందన్నారు.
యాప్ ద్వారా యూరియా ఇవ్వడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. యాప్ వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నాట్లు వేసే సమయంలోనే ఎనిమిది నుంచి తొమ్మిది గంటల కరెంట్ వస్తే వేసవిలో పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. విద్యుత్‌స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల కోసం రైతులు అధికారుల వద్దకు వెళ్తే బడ్జెట్ లేదని చెప్పే పరిస్థితి ఉందన్నారు.
కూడవెల్లి వాగులో పూడికతీత పనులు ప్రారంభించి యాసంగికి నీరందించాలని, లేకుంటే వేల ఎకరాల్లో పంటనష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. మూడుప్రాజెక్టులు ఉన్న సిద్దిపేట జిల్లాలో నీటిపారుదలపై ఇప్పటి వరకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రెండేండ్లలో ఒక్క సారి కూడా సమీక్షా సమావేశం నిర్వహించలేదన్నారు. మల్లన్నసాగర్లో నీళ్లు నిండుగా ఉన్నా కాల్వల్లో పూడిక వల్ల చుక్క నీరు పొలాలకు వెళ్లడం లేదన్నారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లుల దగ్గర దింపే పరిస్థితి లేదన్నారు. మిల్లు యజమానులు ఇష్టానుసారంగా తరుగు పేరుతో ధాన్యంలో కోత విధిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.