దుబ్బాక, సెప్టెంబర్ 23: అత్యంత దుర్మార్గ ప్రభుత్వమేదైనా ఉందం టే అది కాంగ్రెస్ ప్రభుత్వమేనని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడస్తున్నా ఒక్క అభివృద్ధి పనులు చేపట్టకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టిన దాఖలాలు లేవని మండిపడ్డారు.
కాంగ్రెస్ కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కక్షపూరితంగా రాజకీయం చేస్తున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ సర్కారులో దుబ్బాక మున్సిపల్‌కు మంజూరైన టీయూఎఫ్ఐడీసీ రూ.10 కోట్లను ప్రభుత్వం వెనక్కితీసుకుందన్నారు. ప్రభుత్వం, మంత్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించకుండా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కల్యాణలక్ష్మి చెక్కులు వచ్చినా లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సర్కారు అడ్డుపడుతుందని మండిపడ్డారు. రైతులు, పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్‌కు త్వరలోనే గుణపాఠం చెబుతామన్నారు.