దుబ్బాక, ఏప్రిల్ 30: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పది రోజుల కిందట ఆర్భాటంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు.ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో వసతుల లేమి ఒకవైపు, మరోపక్క ధాన్యం కొనుగోలు చేపట్టక రైతులు రోజుల తరబడి ఎండలో ఇబ్బందులు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మార్కెట్‌యార్డుతో పాటు మండలంలోని చాలా కొనుగోలు కేంద్రాల్లో ఇదే దుస్థితి నెలకొన్నది. ఈసారి ప్రభుత్వం యాప్ ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తుండటంతో రైతులతో పాటు కొనుగోలు చేసే నిర్వాహకులు, మరో పక్క రైస్‌మిల్లర్లకు సమస్యగా మారింది.
దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 106 ధా న్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. దుబ్బాక మార్కెట్ యార్డు, అప్పనపల్లి, పోతారం, చీకో డు, ధర్మారం తదితర గ్రామాల్లో రెండు రోజులుగా ధాన్యం కొనుగోలు చేపట్టారు. దుబ్బాకలో ఐకేపీ ఆధ్వర్యంలో 28, మెప్మా ఆధ్వర్యంలో 6, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏడు ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేశారు. పది రోజుల కిందట గ్రామాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభించారు. దీంతో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చారు. ప్రస్తుతం చాలాచోట్ల కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరగక అన్నదాతలు అరిగోస పడుతున్నారు. దుబ్బాక మార్కెట్ యార్డులో కేవలం మూడు వేల బస్తాల ధాన్యం కొనుగోలు చేయగా, ఇందులో వెయ్యి బస్తాల వరకు రైస్‌మిల్లుకు ట్రాన్స్‌పోర్టు చేయాల్సి ఉండగా యాప్ సమస్య వల్ల నిలిచిపోయింది. దుబ్బాక మండలంలో ని ఐకేపీ ఆధ్వర్యంలో 3635 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. మరికొన్ని కేంద్రాల్లో జాలీ లు లేక కొనుగోలు చేపట్టడం లేదు.
పది రోజుల కిందట లచ్చపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. పండించిన పంటను కేంద్రానికి తీసుకువచ్చాం. ఇప్పటి వరకు అధికారులు వచ్చి ధాన్యం కొనుగోలు చేయడం లేదు. రోజు కేంద్రానికి వచ్చి పడిగాపులు కాస్తున్నాం. ఇక్కడ రైతులకు ఎలాంటి వసతులు కల్పించలేదు. రైస్ మిల్లర్లు జాలిపడితే కొనుగోలు చేస్తామంటున్నారు. కొనుగోలు కేంద్రంలో జాలీలు లేవు. తాగేందుకు నీళ్లు లేవు. రాత్రి లైట్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. గతంలో కేంద్రాలు ప్రారంభించిన వెంటనే ధాన్యం కొనుగోలు చేసేది. ఇప్పుడు పది రోజులు గడుస్తున్నా ధాన్యం కొనడం లేదు. కాంగ్రెస్ సర్కార్‌లో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
– ఎల్లయ్య, రైతు,లచ్చపేట (సిద్దిపేట జిల్లా )
ధాన్యం కొనుగోలు చేసేందుకు రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నాం. ఎప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తారో తేలియడం లేదు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని యాప్‌లో సూచించిన రైస్‌మిల్లు నుంచి లారీలో దిగుమతి చేసుకోవాలి. ఎప్పుడు లేనంతగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. బయట దళారులు కూడా ధాన్యం కొనుగోలు చేయడం లేదు.
– నర్సింహులు, రైతు, గోసాన్‌పల్లి, (సిద్దిపేట జిల్లా)