Hamid Mandal : పాకిస్తాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ తీవ్రవాద సంస్థకు చెందిన కీలక ఉగ్రవాది హమీద్ మండల్ అరెస్టయ్యాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎస్టీఎఫ్ (స్పెషల్ టాస్క్‌ఫోర్స్) పోలీసులు అతడిని బర్దమాన్ ప్రాంతంలో శుక్రవారం అరెస్టు చేశారు. హమీద్ వద్ద లభించిన మొబైల్ డేటా, కొన్ని డాక్యుమెంట్ల ఆధారంగా అతడు బెంగాల్ సీఎం సువేందు అధికారిపై దాడికి కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. హమీద్.. జైషే మొహమ్మద్ సంస్థకు చెందిన మరో అగ్రనేత సజ్జద్ భట్‌కు అత్యంత సన్నిహితుడు.
పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి ప్రధాన సూత్రదారుడు సజ్జద్ భట్ అని తెలిసిందే. హమీద్.. బర్ధమాన్‌లోని ఒక రెసిడెన్షియల్ టౌన్షిప్ ఏరియాలోని ఫ్లాట్‌లో ఉండగా అతడిని అరెస్టు చేశారు. మూడు నెలలుగా అతడు అక్కడ అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. అతడిని ఈ రోజు కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. అతడు పోలీసులకు దొరకకుండా, రెసిడెన్షియల్ ఏరియాలో సాధారణ వ్యక్తిలా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. అతడిని ప్రస్తుతం విచారిస్తున్నామన్నారు. ముఖ్యంగా సీఎం సువేందు అధికారిని లక్ష్యంగా ఎంచుకున్నాడని, అతడిపై దాడి చేసేందుకు కుట్ర పన్నినట్లు గుర్తించారు. ఇప్పటికే సీఎంకు సంబంధించిన కొన్ని కీలక వివరాల్ని కూడా అతడు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా జూలై 9 తర్వాత నుంచి సీఎం పర్యటన వివరాలను సేకరించాడు.
దీంతో హమీద్.. ఈ వివరాలు ఎందుకు సేకరిస్తున్నాడు.. ఎలా సేకరిస్తున్నాడు వంటి అంశాలపై అతడిని విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇతరుల పాత్రపై కూడా విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు. అతడిని ఈ రోజు కోర్టులో హాజరుపరిచిన అనంతరం ఎస్టీఎఫ్ పోలీసులు కస్టడీ కోరనున్నారు. ఈ కస్టడీలో అతడి నెట్వర్క్, కాంటాక్ట్స్, కార్యకలాపాలు, లక్ష్యాలు వంటి అంశాల్ని విచారిస్తారు. 2019 ఫిబ్రవరిలో పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే.