అక్కన్నపేట, మార్చి 8: వేసవి ప్రారంభంలోనే సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల వ్యాప్తంగా తాగునీటికి కటకట మొదలైంది. మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీళ్లు బంద్ అయ్యాయి. గుక్కెడు తాగునీటి కోసం తండాలు తల్లాడిల్లిపోతున్నాయి. ఉదయం, సాయంత్రం వ్యవసాయ బావుల వద్ద నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. తండాల్లో ఫంక్షన్లు అయితే రూ.500 నుంచి రూ.1000 చెల్లించి నీళ్ల ట్యాంకర్‌ను కొనుకుంటున్నారు. జనవరి నుంచి మిషన్ భగీరథలో ప్రధానమైన ఇంట్రా, గ్రిడ్ వ్యవస్థల మధ్య నీటి సరఫరాలో సమన్వయం లేకపోవడం, క్షేత్రస్థాయలో నిర్వహణ లోపం, అధికారుల పర్యవేక్షణ కరువై తండాలకు నీళ్లు రాకుండా అయ్యాయి.
గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా తూతూమంత్రంగా రెండు, మూడు రోజులకోసారి నీటి సరఫరా అవుతుంది. మండలంలో సుమారు 100 గిరిజన తండాల వరకు ఉండగా, దాదాపు అన్ని తండాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. భూగర్భ జలాలు అడుగంటి, వచ్చీపోయే కరెంటుతో ఆరుగాలం కష్టం చేసిన పంటలు కండ్లముందే ఎండిపోతుంటే.. మరోవైపు తాగేందుకు కూడా నీళ్లు దొరకని దౌర్భగ్య పరిస్థితులు కాంగ్రెస్ సర్కారులో దాపురించాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని కెప్టెన్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని చౌడు తండా, బోదర్వాగు తండా, మంజ్యనాయక్ తండాలకు దాదాపు మూడు నెలల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు.
మూడు తండాల పరిధిలో సుమారు 400 వరకు గిరిజనులు ఉన్నారు. సుమారు వంద వరకు ఇండ్లు ఉన్నాయి. తండాలకు నీటి సరఫరా రాకపోవడంతో గిరిజన మహిళలు సమీపంలోని వ్యవసాయ బావుల వద్ద నుంచి తెచ్చుకుంటున్నారు. ట్యాంకర్ ద్వారా వచ్చే నీళ్లును నిల్వ చేసుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. పదేండ్ల కిందట కరువు మళ్లీ వచ్చిందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలోని బోదర్వాగు తండాకు చెందిన పలువురు గిరిజనులు గురువారం తాగునీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని, నీటి సమస్యను పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ… మూడు నెలల నుంచి తండాకు నీళ్లు రావడం లేదన్నారు. గతంలో మిషన్ భగీరథ నీళ్లు వచ్చాయనీ, సంక్రాంతి తర్వాత నుంచి నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఎవుసం బావుల వద్ద నుంచి నీళ్లు తెచ్చుకుంటూ వంట చేసుకుంటున్నామన్నా రు. నీళ్లు రావడం లేదని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశా రు. నీళ్ల సమస్యపై గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంతారావును వివరణ కోరగా కొద్దిరోజుల నుంచి ఇంట్రా, గ్రిడ్ల మధ్య సమన్వయం లోపంతో పలు సమస్యల కారణంగా తండాలకు నీళ్లు వెల్లడం లేదు. దీంతో జీపీ ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం.
తండాలకు మిషన్‌భగీరథ నీళ్లు రాక దాదాపు మూడు నెలల అవుతుంది. నీళ్ల కోసం అరిగోస పడుతున్నాం. ట్యాంకర్ వచ్చిందంటే నీళ్ళు పట్టుకునే కాడా లొల్లులు అవుతున్నాయి. ఇన్నాళ్లు ఉదయం, సాయంత్రం తండాల్లోని ప్రతి ఇంటి ఎదుట నల్లా ద్వారా మిషన్ భగీరథ నీళ్లు వచ్చేవి. చాలా సంతోషంగా ఉండేది. కానీ, ఇప్పుడు మళ్ల ఎనుకటి రోజులు వచ్చాయి. బిందెలు పట్టుకొని పొలాల ఒర్రం మీద నుంచి నడుచుకుంటూ నీళ్లుతె చ్చుకొనే రోజులు వచ్చాయి.
-భూక్య స్వరూప, బోదర్వాగు తండా (సిద్దిపేట జిల్లా)
కాంగ్రెసోళ్లు వచ్చిండ్రు..మళ్ల కరువు వచ్చింది..
కాంగ్రెసోళ్లు వచ్చిండ్రు… మళ్ల కరువు వచ్చింది. తాగడానికి నీళ్లు కూడా దొరుకుతలేవు. ఎనుకట కూడా కాంగ్రెసోళ్లప్పుడు గిట్లానే ఏండ్లకు, ఏండ్లు కరువు వచ్చింది. తండాలో కేసీఆర్ సారూ అప్పుడు ట్యాంకు కట్టించిండ్రు. పోయినా ఏడాది వరకు నీళ్లు పుష్కలంగా ఉండేది. ఇప్పుడు ట్యాంకు ఎండిపోయింది. మిషన్ భగీరథ నీళ్లు కూడా రావడం లేదు. ట్యాంకర్ ద్వారా నీళ్లు వచ్చినప్పుడు పట్టుకొని రెండు, మూడు రోజుల దాకా పొదుపు చేసుకొని పరిస్థితి వచ్చింది. నీళ్లు లేవని చెప్పినా పట్టించుకునే వారు కరువయ్యారు.
– బుజ్జి, మంజ్యనాయక్ తండా (సిద్దిపేట జిల్లా)
రైతుల గురించి ప్రభుత్వానికి పట్టింపే లేదు. భూగర్భజలాలు అడగంటడం ఒక సమస్య అయితే, ప్రత్యామ్నాయ మార్గాలు చూడకపోవడం మరో సమస్య. మా గ్రామ శివారు నుంచి కెనాల్ వెళ్లింది. దానిని కనీసం గ్రామంలో ఉన్న చెరువు, కుంటలకు మళ్లిస్తే బాగుండు. కానీ, పాలకులు, అధికారులు ఆలోచన చేయడం లేదు. ఇప్పటికైనా భవిష్యత్‌లో ఇలాంటి సమస్య రాకుండా చూడాలి.
– రాములు, బాలయ్య, రైతులు, సుతారిపల్లి, రామాయంపేట మండలం
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి బోరు పోయడం తగ్గలేదు. ఈసారి మాత్రం ఒక్కసారిగా నీరుపోయడం తగ్గింది. నేను నాలుగెకరాల్లో వరి వేశాను. ఇప్పుడు అది చేతికి వస్తుందో రాదో తెలియదు. చుట్టు పక్క గ్రామాలకు కాల్వల ద్వారా నీరందుతుంది. మాకు కూడా ఒక మార్గం ద్వారా కాళేశ్వరం కాలువ వచ్చింది. మిగతా మార్గాలకు వచ్చే క్రమంలో ప్రభుత్వం మారింది.
-శ్రీకాంత్‌రెడ్డి, ప్రగతి ధర్మారం, రామాయంపేట మండలం
కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా ఏదో ఒక కష్టాన్ని తీసుకువస్తుంది. కేసీఆర్ వచ్చిన తర్వాత వ్యవసాయం ఎంతో మంచిగా చేసినం. సాగునీరు, కరెంటు కష్టాలు పూర్తిగా పోయినయ్. రాత్రిపూట పొలాల వద్దకు పోయే పరిస్థితి ఎప్పుడు రాలేదు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. భూగర్భ జలాలు అడుగంటడం, కరెంటు కోతల వల్ల పొలాల వద్దే ఉంటున్నాం. రైతుల దేవుడు కేసీఆర్, ఆయన వస్తేనే మా బతుకులు మారుతాయి.
– నర్సయ్య, రైతు, శివాయిపల్లి, రామాయంపేట మండలం
మొదట్లో బోరు నుంచి సంవృద్ధిగా నీళ్తు వస్తుండే. కానీ, ఇప్పుడు బోరు నుంచి సరిగ్గా నీళ్లు వస్తలేవు. మా ఊరి వరకు కాలువలు నిర్మించినా బాగుండు. రెండు ఎకరాల వరకు వరి పొలం నాటినా. ఇప్పుడు బారానవంతు ఎండిపోయి, చారానవంతు పొలం తడులతో పారుతున్నది. ఎండిపోయిన పొలానికి ప్రభుత్వం ఏమైన నష్టపరిహారం చెల్లించాలి. లేకపోలే రైతులకు అప్పులే విగులుతయ్.
– చంద్రయ్య రైతు, నందగోకుల్, నిజాంపేట మండలం