తొగుట, ఫిబ్రవరి 28: మండుటెండల్లో తాగడానికి నీళ్లు లేక ప్రజలు తల్లడిల్లుతున్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని ఎల్లారెడ్డిపేటలో 15 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్ప డం లేదు. ఎండల తీవ్రత పెరుగుతుంటే తాగడానికి నీళ్లు ఇవ్వకుంటే ఎలా అని ప్రజలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
శివరాత్రి పండుగ రోజు శివపార్వతులకు పూజలు చేద్దామన్నా మిషన్ భగీరథ నీళ్లు రాక గ్రామస్తులు నానాఅవస్థలు పడ్డారు. గ్రామస్తులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా అధికారులకు పట్టడంలేదని మండిపడుతున్నారు. తాగునీటి కోసం విన్నవించినా పట్టించుకునే వారే కరువయ్యారని విమర్శిస్తున్నారు. తాగునీటికి, ఇతర అవసరాల కోసం వ్యవసాయ బోరు బావుల నుంచి ట్యాంకర్లలో నీటిని తెచ్చుకుంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి మిషన్ భగీరథ నీళ్లు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మిరుదొడ్డి(అక్బర్పేట-భూంపల్లి), ఫిబ్రవరి 28: ఎండాకాలం ప్రారంభ దశలోనే గ్రామాల్లో తాగునీటి తండ్లాట మొదలైంది. సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండ లం రుద్రారంలో వారం రోజులుగా తాగునీటి ఎద్దడితో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని 1వ వార్డులో ఉన్న మిషన్ భగీరథ ట్యాంకుకు నీళ్లు రాకపోవడంతో 1, 2, 11, 12 వార్డుల్లో వారం రోజుల నుంచి తాగునీళ్ల కోసం పడరాని పట్లు పడుతున్నామని మాజీ వార్డుమెంబర్ వెంకట్‌తో ఆయా వార్డుల మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పలుసార్లు అధికారులకు విన్నవించినా తమ గోడు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2వ వార్డులోని మినీ ట్యాంకు వద్ద ఉన్న బోరుబావి నుంచి తాగునీటిని సైకిళ్లపై తీసుకెళ్లాల్సి వస్తుందని మండిపడుతున్నారు. ప్రభుత్వం, మిషన్ భగీరథ అధికారులు స్పందించి నీటి ఎద్దడిని పరిష్కరించాలని కోరారు.