చేర్యాల, ఫిబ్రవరి 25: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీటి సమస్యలు తలెత్తుతుండంతో గ్రామాలు, పట్టణాల్లో మళ్లీ నీటి ట్యాంకర్లు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ఏదో ఫంక్షన్ జరిగితే తప్పా మిగతా రోజుల్లో నీటి ట్యాంకర్లు కనిపించేవి కావు. చేర్యాల మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ ఆకునూరుకు మూడు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్ అయ్యింది. 12 వార్డులు, 8వేల జనాభా ఉన్న ఈ గ్రామస్తులు నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వేసవి ప్రారంభంలోనే తాగునీటి సమస్య రావడంతో వారు డైరెక్ట్ పంపింగ్ ఉన్న సిస్టర్న్‌ల వద్దకు వెళ్లి నీటిని బిందెలతో మోసుకొస్తున్నారు. తాగునీటి సమస్య తలెత్తడంతో ప్రజలు నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో చేసేది లేక గ్రామ పంచాయతీకి సంబంధించిన నీటి ట్యాంకర్‌తో పాటు అదనంగా మరో ట్యాంకర్‌తో వార్డుల వారీగా పంచాయతీ అధికారులు నీటిని సరఫరా చేస్తున్నారు.ట్యాంకర్ రాగానే ఒక్కసారిగా మహిళలు బిందెలు, బకెట్లు తదితర వాటిని పట్టుకుని ట్యాంకర్ల వద్ద సిగపట్లు పడుతున్నారు.
గతంలో సమయానికి మిషన్ భగీరథ నీరు రావడంతో మహిళలకు ఇబ్బందులు ఎదురుకాలేదు. ఇప్పుడు మహిళలు వారి పనులు వదులుకుని ట్యాంకర్ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే మిషన్ భగీరధ నీటి సరఫరాను పునరుద్ధరించాలని పలువురు ఆకునూరు గ్రామస్తులు కోరారు. ఇప్పటికే మండలంలోని కాశేగుడిసెల గ్రామంలో తాగునీటి కోసం గ్రామస్తులు తండ్లాడుతున్నారు. ఇప్పుడు ఆకునూరులోనూ నీటి సమస్య తలెత్తింది. మున్ముందు నీటి సమస్య ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.