చిన్నశంకరంపేట,సెప్టెంబర్14: తాగునీటి కోసం కొన్ని గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే మరికొన్ని గ్రామాల్లో పర్యవేక్షణ లేక నీరు వృథాగా పోతున్నది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని జంగరాయి గ్రామంలో నల్లాలకు ఆన్‌ఆఫ్‌లు బిగించలేదు. దీంతో తాగునీరు వృథాగా పోతున్నది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గ్రామంలోని నల్లాలకు ఆన్‌ఆఫ్‌లు బిగించి తాగునీరు వృథా కాకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
వెల్దుర్తి, సెప్టెంబర్ 14: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని కుకునూర్ గ్రామానికి నాలుగు రోజుల నుంచి మిషన్‌భగీరథ తాగునీరు సరఫరా కావడం లేదు. స్థానిక పంచాయతీ పరిధిలోని బోరు మోటర్లు పనిచేయడం లేదు. దీంతో గ్రామస్తులకు నీటి కష్టాలు తప్పడం లేదు. నాలుగు రోజుల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు. గతంలో సైతం ఐదు రోజుల పాటు తాగునీరు రాలేదు. ప్రస్తుతం నాలుగు రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైన అధికారులు స్పందించి బోరు మోటర్లకు మరమ్మతులు చేయించడంతో పాటు మిషన్ భగీరథ నీరు సక్రమంగా సరఫరా అయ్యేటట్లు చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కౌడిపల్లి, సెప్టెంబర్14: మిషన్ భగీరథ నీళ్లు రాక బోరు మోటర్లు నడవక మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని లింగంపల్లిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఆరు నెలలుగా తాగునీటి ట్యాంకు బోరు మోటరు కాలిపోయింది. అప్పటి నుంచి గ్రామ కార్యదర్శి దానికి మరమ్మతులు చేయించలేదు. తాగడానికి వ్యవసాయ బోరు మోటర్ల నుంచి గ్రామస్తులు నీటిని తెచ్చుకుంటున్నారు. బోరు మోటరు బాగుచేయమని కార్యదర్శిని అడిగితే గ్రామ పంచాయతీలో నిధులు లేవని చెబుతున్నాడని గ్రామస్తులు వాపోయారు. గ్రామ పంచా యతీలో నిధులు లేక లక్షలు ఖర్చుచేసి కొనుగోలు చేసిన గ్రామ పంచా యతీ ట్రాక్టర్లు మూలకుపడ్డాయి.