జహీరాబాద్, జూన్ 9 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని హోతికే గ్రామ శివారులోని డబుల్ బెడ్ రూం ఇండ్ల్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని జహీరాబాద్ సీపీఎం ఏరియా కమిటీ సభ్యుడు మహిపాల్ డిమాండ్ చేశారు. సోమవారం జహీరాబాద్లోని ప్రధాన రోడ్డుపై సీపీఎం ఆధ్వర్యంలో బైఠాయించారు. ఆనంతరం తహసీల్ కార్యాలయం ఎదుట సీపీఎం నాయకులు, లబ్ధిదారులు కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండ్లు లేక నిరుపేదలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
డబుల్ బెడ్రూం ఇండ్లకు పట్టా సర్టిఫికెట్లు అందజేసి ఏండ్లు గడుస్తున్నా నేటికి ఇండ్లను ఎందుకు అప్పగించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకుని లబ్ధిదారులకు ఇండ్ల్లను అప్పగించాలని, లేని పక్షంలో తామే లబ్ధిదారులతో కలిసి ఇండ్ల్లను అక్రమించుకుంటామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ దశరథ్ దృష్టికి సమస్య తీసుకెళ్లగా 20 రోజుల్లో పరిష్కరిస్తాని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. ఆందోళనలో సీపీఎం నాయకులు సలీమొద్దీన్, శ్రీకాంత్, లబ్ధిదారులు పాల్గొన్నారు.