మర్కూక్, జూన్17: పేదోడి సొంతింటి కలను నిజం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని, త్వరలో ప్రతి పేద కుటుంబానికి గృహలక్ష్మి పథకం అందిస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. శనివారం మండలంలోని పాములపర్తి గ్రామ సమీపంలో కేసీఆర్ కాలనీలో ప్రభుత్వం, కావేరి భాస్కర్‌రావు చారిటబుల్ ఫౌండేషన్ సౌజన్యంతో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి ప్రారంభించి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. గృహ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదలకు పెద్ద కొడుకుగా ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చారని తెలిపారు. కేసీఆర్ కాలనీలో ప్రభుత్వం ఇండ్ల నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వగా, కావేరి భాస్కర్‌రావు చారిటబుల్ ఫౌండేషన్ రూ.11.50 లక్షలు ఖర్చు చేసి హైదరాబాద్ తరహాలో అద్భుతంగా సకల సౌకర్యాలతో ఇండ్లు నిర్మించిన సీఎం కేసీఆర్, కావేరి సీడ్స్ వారికి లబ్ధిదారులు రుణపడి ఉండాలని కోరారు.
గతంలో గజ్వేల్ ప్రాంతం గతుకులుగా ఉండేదని, నేడు బతుకుల గజ్వేల్గా మారిందన్నారు. కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో భూగర్భజలాలు పెరిగి భూమికి బరువయ్యే పంటలు పడుతున్నాయన్నారు. గతంలో పని దొరకని పల్లెల బతుకుల నుంచి నేడు పంట పొలాల్లో కూలీలు దొరక్కక ఇతర రాష్ర్టాలకు కూలీలు వచ్చే స్థాయికి ఎదిగిందన్నారు. కర్ణాటక వాళ్లు తెలంగాణ బియ్యం కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారని తెలిపారు. గతంలో ఎంత మంది సీఎంలు మారినా పేదల బతుకులు మారలేదని, కానీ, సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత పేదల బతుకులు బంగారమయ్యాయని స్పష్టం చేశారు. నాడు సర్కారు దవాఖాన అంటే అబ్బో అనేవాళ్లు.. నేడు సర్కారు దవాఖానకు బారులు తీరుతున్నారన్నారు. గర్భిణుల కష్టాలు చూసిన సీఎం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు తీసుకువచ్చారని తెలిపారు.
శివుడు నెత్తిమీద గంగను పెట్టుకున్నట్లు సీఎం కేసీఆర్ పాములపర్తి సమీపంలో కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని తెలిపారు. రాష్ట్రంలోనే గజ్వేల్ మోడల్‌గా మారిందని, ఇక్కడ ప్రాంత ప్రజలు చాలా అదృష్టవంతులన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయం చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఏఎంసీలు చైర్మన్లు జహంగీర్, మాదాసు శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి, ఆత్మ చైర్మన్ రంగారెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దేవీరవీందర్, ఎంపీపీ పాండుగౌడ్, జడ్పీటీసీ మంగమ్మరాంచంద్రం, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు కృష్ణయాదవ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణకర్‌రెడ్డి, బీసీ సెల్ మండలాధ్యక్షుడు కనకయ్య, నాచారం దేవాలయం మాజీ చైర్మన్ హరిపంతులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ‘గడా’ అధికారి మత్యుంరెడ్డి, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, తహసీల్దార్ భాగ్యరేఖ పాల్గొన్నారు.
ఇల్లు బాగుంది..
మాకు ఇచ్చిన ఇల్లు చాలా బాగుంది. సకల వసతులు ఉన్నా యి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా విశాలమైన గదులతో మం చిగా కట్టించారు. ఇల్లు ను చూస్తే పట్నంలో ఇల్లును చూసినట్లే ఉంది. మాకు ఇల్లు కట్టించిన సీఎం కేసీఆర్, కావేరి సార్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాం.
–బాలమణి, లబ్ధిదారులు
కేసీఆర్ కాలనీ పెట్టుకున్నాం
మా కాలనీలో మొ త్తం 35 ఇండ్లు ఉం డేవి. మా ఇండ్లకు సరైనదారి లేకుండే. ఇం తకు ముందు ఇల్లు పెంకుటిల్లు చిన్నగా ఉండేది. ఇప్పుడు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా మంచిగుంది. ప్రభుత్వం, కావేరి వాళ్లు కలిసి కట్టించడంతో కాలనీకి సీఎం కేసీఆర్ కాలనీగా పెట్టుకున్నాం.
–కనకయ్య, లబ్ధిదారుడు