హుస్నాబాద్, ఫిబ్రవరి 16: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ప్రశాంతంగా జరిగింది. ఇన్చార్జి ఆర్డీవో అనంతరెడ్డి, ఏసీపీ వాసాల సతీశ్, తహసీల్దార్ సుల్తానా బేగం, మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య ఆధ్వర్యంలో లక్కీడ్రా ద్వారా లబ్ధ్దిదారులను ఎంపిక చేశారు. ఇప్పటికే రెండుసార్లు సర్వేచేసి 342మందితో అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ఇప్పటి వరకు 264 ఇండ్లు పూర్తయి ఉండటంతో ఇందుకు లబ్ధిదారుల ఎంపికను లక్కీడ్రాద్వారా చేశారు.
342మంది అర్హుల జాబితాను ఒక బాక్సు, 264ఇండ్ల నంబర్లు మరో బాక్సులో వేసి అందరి సమక్షంలో లక్కీడ్రా తీసే కార్యక్రమాన్ని ఆర్డీవో అనంతరెడ్డి ప్రారంభించారు. మొదటి నుంచి చివరి వరకు లబ్ధిదారులు ఉత్కంఠతతో ఎదురు చూశారు. లక్కీడ్రాలో పేరు వచ్చిన వారు చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో అనంతరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం పూర్తయిన ఇండ్లకు సరిపడా లబ్ధిదారులను అందరి సమక్షంలో ఓపెన్ లక్కీడ్రాద్వారా ఎంపిక చేశామన్నారు. ఎంపికైన 264 లబ్ధిదారుల్లో అనర్హులు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే ఫిర్యాదు చేయవచ్చని, అనర్హులని తేలితే వారికి వచ్చిన ఇంటిని రద్దు చేస్తామని తెలిపారు. త్వరలోనే ఇండ్లకు పట్టాలు పంపిణీ చేసి సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఏసీపీ సతీశ్, సీఐ ఎర్రల కిరణ్, ఎస్సైలు మహేశ్, వివేక్, నరేందర్‌రెడ్డి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ ఏడీఏ పి.మహేశ్, మున్సిపల్ ఆర్ఐ కృష్ణ, రెవెన్యూ సిబ్బంది రాములు, ఎల్లయ్య, యాదగిరి, మెప్మా రాజు తదితరులు లక్కీడ్రా విధులు నిర్వహించారు.
సొంతింటి కల నెరవేరింది..
సర్కారోళ్లు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో నాకు ఇల్లు రావడం సంతోషంగా ఉంది. ఏండ్ల తరబడి సొంతిల్లు లేక కిరాయికి ఉంటూ ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు సొం తింటి కల నెరవేరింది. సీఎం కేసీఆర్ సార్, మంత్రి హరీశ్‌రావు , ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌కు రుణపడి ఉంటాం. సీఎం కేసీఆర్ సార్ దయతో మేం సొంతిం టి వాళ్లమయ్యాం. చాలా ఆనందంగా ఉంది.
– కంభంపాటి రజిత, 11వ వార్డు,హుస్నాబాద్
కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం..
ఇల్లు లేక నానా ఇబ్బందులు పడ్డం. కూలీనాలీ చేసుకుని సొంతిల్లు కట్టుకునే స్థోమత మాకు లేదు. సీఎం కేసీఆర్ దయతో మాకు ఇల్లు వచ్చింది. సీఎం కేసీఆర్ సారుకు మా కుటుంబం ఎల్లవేళలా రుణపడి ఉంటది. ఇక మేము మా పిల్లలు ఆనందంగా సొంతింట్లో ఉండి ఎలాంటి ఇబ్బంది లేకుండా బతుకుతం. మాలాంటి పేదలకు ఇండ్లు వచ్చేలా చేసిన వారందరికీ ధన్యవాదాలు.
– చామంతుల రజిత, 6వ వార్డు, హుస్నాబాద్
ఇల్లు ఇవ్వడం ఆనందంగా ఉంది..
నా భర్త చనిపోయాడు. కూలీనాలీ చేసుకుంటూ ఇద్దరు పిల్లలను సాదుకుంటున్న. నేను చేసే పనికి వచ్చే కూలీ ఇంటి ఖర్చులకే సరిపోయేది. సొం తంగా గుంట జాగా కొనుక్కునే పరిస్థితి లేదు. నాలాంటి పేదలను గుర్తించి సర్కారోల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్ సారు దయతో నా కల నెరవేరింది. కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– చుక్క స్వరూప, 16వ వార్డు, హుస్నాబాద్