సంగారెడ్డి, మే 28(నమస్తే తెలంగాణ) : అందోలు నియోజకవర్గంలో రైతులు విత్తనాల కోసం ధర్నాలు చేస్తున్నా మంత్రి దామోదర రాజనర్సింహ జాడ కనిపించడం లేదని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. మంగళవారం సంగారెడ్డిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. అందోలు నియోజకవర్గంలోని రైతులు జనుము, జీలుగ విత్తనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. వారం రోజుల క్రితం జోగిపేటలో జీలుగ విత్తనాల కోసం రైతులు ధర్నా చేశారన్నారు. మంగళవారం చౌటకూరు, పుల్కల్లోనూ రైతులు జీలుగ విత్తనాల కోసం క్యూలో పట్టాదారు పాసుపుస్తకాలను ఉంచి పడిగాపులు పడినట్లు తెలిపారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ తన నియోజకవర్గ కేంద్రమైన ఆందోల్‌లో రైతులు విత్తనాల కోసం ఆందోళనలు చేస్తున్నా స్పందించకపోవడం తగదన్నారు. ఇంతవరకు జిల్లా అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి ఎందుకు సమీక్ష నిర్వహించలేదని క్రాంతికిరణ్ ప్రశ్నించారు.
ఎన్నికల కోడ్ పేరు కారణం చూపుతూ మంత్రి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కొత్తగా చేపట్టే పనులకు ఎన్నికల కోడ్ నిబంధనలు వర్తిస్తాయని, ఏటా వానకాలం సీజన్లో రైతులకు విత్తనాలు, ఎరువులు అవసరం అవుతాయని, వీటి గురించి మంత్రి సమీక్ష జరిపి అధికారులకు సూచనలు చేస్తే ఎన్నికల కోడ్ ఎందుకు అడ్డుగా వస్తుందని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో రైతులు ఏనాడూ విత్తనాలు, ఎరువుల కొరత చూడలేదన్నారు. సీజన్‌కు ముందే రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచేదన్నారు. అప్పటి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రితో పాటు జిల్లా మంత్రి హరీశ్‌రావు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు జరిపి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూసేవారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు విజయ్ పాల్గొన్నారు.