‘కురుమల పోరాట స్ఫూర్తికి దొడ్డి కొమురయ్య ప్రతీక, తెలంగాణ కోసం పోరాడి అమరుడైన తొలి వ్యక్తిగా చరిత్రలో నిలిచాడు.’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆదివారం కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్, మాణిక్‌రావులతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. అంతకు ముందు కంది మండలం మామిడిపల్లిలో కురుమసంఘం భవన నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ కురుమల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, గొల్లకురుమలకు గొర్రెల పంపిణీకి సీఎం కేసీఆర్ రూ.11వేల కోట్లు కేటాయించారన్నారు. ఏ జిల్లాలో లేని విధంగా సంగారెడ్డి జిల్లాలో మొట్టమొదటి సారిగా రూ. 2 కోట్లతో రెండెకరాల్లో కురుమ సంఘం భవనాన్ని నిర్మించుకుంటున్నామని, ఇదే తరహాలో మెదక్‌లోనూ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రెండో విడత గొర్రెల పంపిణీని త్వరలోనే ప్రారంభింస్తామని తెలిపారు.
– సంగారెడ్డి/ సంగారెడ్డి కలెక్టరేట్/కంది, ఫిబ్రవరి 26
సంగారెడ్డి/ సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 26: గడీలు బద్ధలు కొట్టి భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన యోధుడు దొడ్డి కొమురయ్య అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ కోసం పోరాడి అమరుడైన తొలి వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచారన్నారు. కురుమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యం లో ఆదివారం సంగారెడ్డిలో దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్, మాణిక్‌రావుతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసి న బహిరం సభలో మంత్రి మాట్లాడుతూ కురుమల పోరాట స్ఫూర్తికి దొడ్డి కొమురయ్య ప్రతీక అని పేర్కొన్నారు. తెలంగాణ కో సం ఆయన చేసిన కృషిని కొనియాడారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా సంగారెడ్డి జిల్లాలో తొలిసారి కురుమ భవనం నిర్మించుకోవడం సంతోషకరమన్నారు. మామిడిపల్లిలో దాదాపు రెండెకరాల స్థలంలో రూ.2 కోట్లతో కురుమ భవనం నిర్మించుకోబోతున్నామని, అందుకు భూమిపూజ కూడా చేసుకున్నామన్నారు. జిల్లాలో కురుమల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు.
దిన దినాభివృద్ధిలో కొమురవెల్లి మల్లన్న దేవాలయం
కురుమల ఆరాధ్య దైవమైన కొమురవెల్లి మల్లన్న దేవాలయం దిన దినాభివృద్ధి చెందుతున్నదని మంత్రి వెల్లడించారు. స్వయంగా సీఎం కేసీఆర్ మల్లన్న దేవుణ్ణి నమ్ముకొని మల్లన్న సాగర్‌ను మూడున్నరేండ్లల్లో పూర్తి చేశాడని గుర్తు చేశారు. గతంలో కొమురవెల్లి మల్లన్నకు ఏ సీఎం కూడా పట్టువస్ర్తాలు సమర్పించలేదని, సీఎం కేసీఆర్ పట్టువస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారని వివరించారు. కురుమల కోరిక మేరకు మల్లన్న దేవాలయం చైర్మన్‌గా సంపత్ కురుమను నియమించుకున్నామని తెలిపారు. అదేవిధంగా కురుమలకు రాజకీయ అవకాశాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. యెగ్గె మల్లేశం వంటి వారికి చట్ట సభల్లో అవకాశం కల్పించిన విషయం గుర్తు చేశారు.
కులవృత్తుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నది
ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో కులవృత్తులకు పెద్దపీట వేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వాలు కులవృత్తులను పట్టించుకోలేదని గుర్తు చేశారు. కురుమల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. ఇప్పటికీ రెండు సార్లు ఆశీర్వదించిన కురుమలు మూడోసారి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.
గొర్రెల పంపిణీకి రూ.11వేల కోట్లు..
దేశంలో ఎక్కడాలేని విధంగా గొర్రెల పంపిణీకి రూ.11 వేల కోట్లు సీఎం కేసీఆర్ కేటాయించారని మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. గొల్ల, కురుమలకు గొర్రెలు పంపిణీ చేసి ఆదుకున్న ఘనత ఆయనకే దక్కిందన్నారు. అందుకు ఆకర్షితుడైన కర్ణాటక మంత్రి రేవన్న హైదరాబాద్ వచ్చి సీఎం కేసీఆర్‌కు గొంగడితో సన్మానం చేయడమే నిదర్శనమని పేర్కొన్నారు. త్వరలోనే రెండో దశ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి వచ్చే శ్రీరామనవమి కాగానే, రాష్ట్రంలో మూడు, నాలుగు నెలల్లోనే పూర్తి చేస్తామన్నారు. ధరలు పెరిగినందున యూనిట్ కాస్ట్ కూడా పెంచామన్నారు. ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికీ గొర్రెలు పంపిణీ చేస్తామన్నారు.
కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి
కేంద్రంలో బీసీల సంక్షేమానికి ఏమీ ఇవ్వలేదని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో కేవలం రూ.2వేల కోట్లు బీసీల కోసం ఇవ్వడం విడ్డూరంగా ఉన్నదన్నారు. బీసీలపై పూర్తిగా అన్యాయంగా కేంద్ర ప్రభుత్వం ఉన్నదని దుయ్యబట్టారు. కనీసం బీసీ మంత్రిత్వశాఖ లేకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో సీఎం అన్నివర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఆదానీ అంబానీ లాంటి పారిశ్రామికవేత్తల కోసమే బీజేపీ ప్రభుత్వం పని చేస్తుందని విమర్శించారు. దేశంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు.
రూ.12 కోట్లతో కురుమ భవనం : యెగ్గె మల్లేశం, ఎమ్మెల్సీ, రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రూ.12 కోట్లతో లక్షా 8వేల స్కేర్ ఫీట్ల స్థలంలో కురుమ భవన నిర్మాణం పూర్తవుతున్నది. మంత్రి హరీశ్‌రావు చొరవతో కురుమల ఆత్మగౌరవ భవనం నిర్మించుకుంటున్నాం. రూ.ఐదారు వందల కోట్లతో గొల్ల కురుమలకు వేర్వేరు భవనాలు పూర్తవుతున్నాయి. సీఎం కేసీఆర్ బోలా శంకరుడు. అడగకున్నా అన్నీ ఇస్తాడు. కురుమ విద్యార్థి హాస్టల్ నిర్మాణం రుసుము రూ.కోటి మాఫీ చేశారు. నా 50 ఏండ్ల రాజకీయంలో ఇలాంటి నేతను చూడలేను. కురుమలు తీసుకున్న రుణాలు సకాలంలో తిరిగి చెల్లించారు. నిజాయిగా ఉండే జాతి కురుమ జాతి. అదేవిధంగా రాజకీయంగా కురుమలకు అవకాశం కల్పించాలి. మాకు అండగా ఉండాలి. మరో ముగ్గురు, నలుగురు అభ్యర్థులకు ఎమ్మెల్యే, కనీసం ఒకరికి ఎంపీ సీటు ఇవ్వాలి. గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులనే చూపిస్తాం, వారికి అవకాశం కల్పించాలి.
కురుమలకు అండగా ఉండాలి : బూరుగడ్డ పుష్పానగేశ్, ఆర్సీపురం కార్పొరేటర్
ప్రభుత్వం కురుమలకు అండగా ఉండాలి. కురుమలు మాట తప్పని, మడమ తిప్పని నిజాయితీతో ప్రభుత్వం వెన్నంటే ఉంటాం. దామాషా ప్రకారం కురుమలకు రాజకీయ అవకాశం కల్పించాలి. చట్ట సభల్లో గుర్తింపు ఇవ్వాలి. ఇప్పటికే కురుమలకు ఎంతో మేలు చేసిన ప్రభుత్వం రాజకీయంగా కూడా ఆదుకోవాలి.
హైదరాబాద్‌లో రూ.300 కోట్ల ఆస్తి
కురుమలకు హైదరాబాద్ నడి బొడ్డులో రూ.300 కోట్ల ఆస్తి కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధానిలో కురుమ భవనం నిర్మించి కేసీఆర్ కురుమల ఆత్మ గౌరవం నిలిపారన్నారు. మరో రెండు నెలల్లో భవన నిర్మాణం పూర్తవుతుందన్నారు. రెండు లక్షల మంది గొల్ల, కురుమలతో ప్రారంభించుకుందామన్నారు. అదే స్ఫూర్తితో సంగారెడ్డిలో కురుమ భవనం నిర్మించుకుంటున్నామన్నారు. రూ.2 కోట్లతో నిర్మాణం చేపడుతామని హామీ ఇచ్చారు. న్యాయాన్ని, ధర్మాన్ని, కష్టాన్ని నమ్ముకున్న జాతి కురుమ జాతి అని, కురుమల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.
రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి వంటి అనేక పథకాలను ప్రభుత్వం పేదలకు అందిస్తున్నదని గుర్తు చేశారు. అనేక రాష్ర్టాల్లో ముక్కు పిండి కరెంట్ బిల్లులు వసూలు చేస్తే మన రాష్ట్రంలో పైసా ఖర్చు లేకుండా ఉచిత విద్యుత్ అందిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని వివరించారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా కురుమలలో బాల్య వివాహాలు ఆగిపోవడం సంతోషకరమన్నారు. సిద్దిపేటలో కూడా కురుమ భవనం నిర్మించడం జరిగిందన్నారు. మెదక్‌లో కూడా త్వరలో కురుమ భవనం నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామన్నారు.
కురుమల డిక్లరేషన్స్..
అంతకుముందు కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు బూరుగడ్డ నగేశ్ కురుమల డిక్లరేషన్స్‌ను మంత్రికి వివరించారు. రాష్ట్రంలో అన్ని కులాల కంటే అధికంగా ఉన్న కురుమలకు రాజకీయ పార్టీలు, చట్ట సభల్లో జనాభా దామాషా ప్రకారం అవకాశాలు కల్పించాలి, ప్రస్తుత జనాభా ప్రకారం అసెంబ్లీలో 12 మంది ఎమ్మెల్యేలు ఉండాలి, ఆ దిశగా అన్ని రాజకీయ పార్టీలు జనాభా నిష్పత్తి ప్రకారం అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు టికెట్లు కేటాయించాలి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రతి నియోజకవర్గంలో 40 నుంచి 50 వేల కురుమ ఓట్లు ఉన్నందున, కనీసం ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటు ఇవ్వాలి, తెలంగాణలోని వివిధ నామినేటెడ్, కార్పొరేషన్లల్లో పదవులు కల్పించాలి, రెండో విడత గొర్రెల పంపిణీ కింద నగదు బదిలీ పద్ధతిన అందించాలి. 50 ఏండ్లు దాటిని గొర్రె కాపరులకు, ఒగ్గు కళాకారులకు పింఛన్లు ఇవ్వాలి. ప్రమాదవశాత్తు గొర్రె కాపరులు మరణిస్తే రూ.6 లక్షలు బీమా ఇవ్వాలి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలి.
ఆయన జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి, ప్రభుత్వ జీవో 559 ప్రకారం గొర్రెలు మేపేందుకు ప్రతి గ్రామంలో ఐదెకరాలు కేటాయించాలి. అనంతరం మంత్రి హరీశ్‌రావును కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్, కొనింటి మాణిక్‌రావు, కర్ణాటక మాజీ మంత్రి రేవన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, కురుమ సంఘం రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశం, యువత అధ్యక్షుడు కొల్కూరి ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి కిష్టయ్య, మాజీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీహరి, జడ్పీటీసీ మీనాక్షి సాయికుమార్, జోగిపేట మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, మాజీ ఎంపీపీ చెర్యాల ఆంజనేయులు, కురుమ సంఘం ఉపాధ్యక్షుడు తాటిపల్లి పాండు, బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్, నాయకులు సోమేశ్ కుమార్, ప్రదీప్, ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
కుల సంఘాల అభివృద్ధికి పెద్దపీట
కంది, ఫిబ్రవరి 26: తెలంగాణ ప్రభుత్వం కుల సంఘాల అభివృద్ధికి పెద్దపీట వేసిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం కంది మండల పరిధిలోని మామిడిపల్లి శివారులో కురుమ సంఘం భవన నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో కుల సంఘాలకు అసలైన గుర్తింపు వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ అన్ని కులాలకు సమ ప్రాధాన్యతనిచ్చి స్థలాలు కేటాయిస్తూ, భవన నిర్మాణాలకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సంగారెడ్డిలో కురుమ సంఘం భవనం నిర్మించుకోవడం సంతోషకరమన్నారు. అంతకుముందు గణేశ్‌గడ్డ చౌరస్తా వద్ద జిల్లా కురుమ సంఘం నాయకులు మంత్రి హరీశ్‌రావుకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీపాటిట్, ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్, మాణిక్‌రావు, ఎమ్మెల్సీ, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యెగ్గె మల్లేశం, జిల్లా అధ్యక్షుడు నగేశ్, సంగారెడ్డి కలెక్టర్ శరత్ పాల్గొన్నారు.