అందోల్, ఆగస్టు 21 : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న అందోల్ నియోజకవర్గంలోని జోగిపేట ప్రభుత్వ దవాఖానలో గర్భిణిపై గైనకాలజిస్ట్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. గర్భిణి సాయిభవానీ వివరాల ప్రకారం… జోగిపేటకు చెందిన ఏడునెలల గర్భిణి సాయిభవానీ గురువారం జోగిపేట దవాఖానకు వచ్చింది. గర్భసంచి సమస్య ఉండడంతో ఆమెకు కుట్లు వేయాల్సి ఉంది. ఇదే విషయంపై డ్యూటీ డాక్టర్ తస్లీంతో మాట్లాడగా, ఆమె ఒక్కసారిగా గర్భిణితో పాటు ఆమె భర్తపై విరుచుకుపడింది. పోలీసులకు ఫోన్ చేయండి ఇద్దరిని లోపల వేయిద్దాం అంటూ అక్కడే ఉన్న మరో వైద్యుడికి చెప్పింది.
దీంతో ఖంగుతిన్న భార్యాభర్తలు ఆమె తీరుతో బయపడి బయటకు వచ్చి ఈ విషయాన్ని డీసీహెచ్ఎస్ సంగారెడ్డికి ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయండి అంటూ ఆయన ఉచిత సలహా ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. గర్భిణితో పాటు ఆమె భర్త అక్కడే ఉండగా, తన కుర్చీలో నుంచి లేచిన వైద్యురాలు ఫోన్లో మాట్లాడుతూ వైద్యం చేయకుండానే బయటకు వెళ్లింది. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ.. 7నెలల గర్భిణి అయిన తాను గర్భసంచి సమస్యతో బాధపడుతున్నానని తెలిపింది. బుధవారం సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు వెళ్లగా, అక్కడి సిబ్బంది జోగిపేట ప్రభుత్వ దవాఖానలో కనీసం కుట్లు కూడా వేయరా..? దానికి ఇక్కడి వరకు రావాలా..? అక్కడికే వెళ్లండి అంటూ చెప్పి తిప్పి పంపించారని ఆవేదన వ్యక్తం చేసింది.
దీంతో గురువారం తన భర్త సుందర్‌తో కలిసి జోగిపేట దవాఖానకు వస్తే, గైనకాలజిస్ట్ తస్లీం బూతులు తిడుతూ దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తంచేశారు. గర్భవతిని అని చూడకుండా సంగారెడ్డి నుంచి జోగిపేటకు పంపారని, జోగిపేటలో డాక్టర్ బూతులు తిడుతూ పోలీస్ కేసు పెడాతనంటూ బెదిరించారని విలపించారు. గర్భిణి బస్సుల్లో ప్రయాణం చేయడం ఎంత కష్టంగా ఉంటుంది, అంత కష్టపడి ఇలా దవాఖాన చుట్టూ తిరగాలా… ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం అనేది పేపర్లకే పరిమితమా అంటూ గర్భిణి ప్రశ్నించింది.
ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సొంత నియోజకవర్గ కేంద్రమైన జోగిపేటలో, జిల్లా కేంద్రమైన సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానల పనితీరుపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. గర్భిణితో దురుసుగా ప్రవర్శించిన జోగిపేట వైద్యురాలితో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంగారెడ్డి దవాఖాన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జోగిపేట ప్రభుత్వ దవాఖానలో తరుచూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని రోగులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయంపై డీసీహెచ్ఎస్ డాక్టర్ సంగారెడ్డి మాట్లాడుతూ.. జోగిపేట దవాఖానలో గర్భిణికి కుట్లు వేయడం సాధ్యకాదనే వారు సంగారెడ్డికి పంపించారని తెలిపారు. నెలలు నిండుతుండడంతో చాలా జాగ్రత్తగా కుట్లు వేయాల్సి ఉంటుందని, అందుకోసం సంగారెడ్డి దవాఖాన అయితే మంచిదని ఇక్కడికి పంపారని, కానీ.. అక్కడి దవాఖాన వైద్యులు మళ్లీ జోగిపేటకు పంపించడపై విచారణ చేపడతామని తెలిపారు. జోగిపేట వైద్యురాలు గర్భిణిపై దరుసుగా ప్రవర్తించిన విషయంపై పూర్తి విచారణ చేపడుతామని వివరించారు.