పటాన్చెరు రూరల్, జూలై 2 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో శిథిలాల తొలిగింపు ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నది. దీంతో బాధిత కుటుంబాల్లో దు:ఖం పొంగుకొస్తున్నది. కనీవిని ఎరుగని స్థాయిలో సిగాచి పరిశ్రమ ప్రొడక్షన్ బ్లాక్‌లో జరిగిన పేలుడులో ఇప్పటికే 53 మంది వరకు మృతి చెందినట్టుగా సమాచారం. అధికారికంగా మృతుల సంఖ్య తక్కువగా చెబుతున్నా, వాస్తవంగా మృతులు మాత్రం ఇంకా పెరుగుతూనే ఉన్నారు.ఉత్తర ప్రదేశ్, బీహారు, ఒడిశా, అస్సాం రాష్ట్రాల నుంచి కార్మికుల బంధువులు, రక్త సంబంధీలు నేరుగా సిగాచి పరిశ్రమ వద్దకే వస్తున్నారు.
అక్కడికి రాగానే భావోద్వేగంతో రోదిస్తున్నారు. వచ్చిన వారిని ఎక్కువ సేపు నిలవనీయకుండా పోలీసులు తక్షణమే వారిని ఐలా భవనం వద్దకు పంపిస్తున్నారు. ఐలా భవనం వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లో పేర్లు నమోదు చేసుకుని, వారి వద్ద ఉన్న మృతదేహాల ఫొటోలు చూపిస్తున్నారు. అక్కడికి వచ్చింది రక్త సంబంధీకులైతే డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే డీఎన్ఏ పరీక్షలకు రక్త నమూనాలు ఇచ్చిన బాధితులకు రిపోర్టులు రాలేదు. 22 మంది ఇప్పటి వరకు తమ రక్త సంబంధీకులు కనిపించడం లేదని డీఎన్ఏ శాంపిల్స్ ఇచ్చారు. బుధవారం 18 మృతదేహాలను అధికారులు గుర్తించారు. వివిధ దవాఖానల్లో 35 మం దికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరో 20 మృతదేహాలు గుర్తుపట్టాల్సి ఉందని అధికారులు తెలిపారు.
ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీం, ఎస్‌జీఆర్‌ఎఫ్, డీడీఆర్ఎస్, ఫోరెనిక్స్ బృందాల ఆధ్వర్యంలో సిగాచి పరిశ్రమలో శిథిలాల తొలిగింపు, మృతదేహాలను గుర్తిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున నుంచి వర్షం పడడంతో రాత్రి సమయంలో పనులు మందకొడిగా కొనసాగాయి. మంత్రి దామోదర రాజనర్సింహ స్వయంగా దగ్గరుండి శిథిలాల తొలిగింపునకు ఆదేశాలు ఇస్తున్నా , ఆ స్థాయిలో వేగంగా శిథిలాల తొలిగింపు కొనసాగడం లేదు. జేసీబీలు, ట్రాక్టర్లు, కటింగ్ మిషిన్లతో పనులు చేస్తున్నారు.
చాలాసార్లు పనులు చిన్నపాటి సమస్యలకే ఆగిపోతున్నాయి. మూడో రోజు కూడా తమవారి ఆచూకీ లభించక పోవడం, మృతదేహాలు పెద్దగా బయట పడకపోవడం చూసి వారి రక్త సంబంధీకులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అధికారులను బతిమాలుతున్నారు. మృతదేహాలనైనా చూపించాలని కోరుతున్నారు. పరిశ్రమ పోలీసుల పహారాలో ఉండటంతో వచ్చిన బంధువులు పరిశ్రమను దూరం నుంచే చూసి రోదిస్తూ వెళ్లిపోతున్నారు. ఎవరైనా అక్కడి నుంచి వెళ్లని పక్షంలో పోలీసులు బలవంతంగా పంపిస్తున్నారు.
అంత్యక్రియలు ప్రారంభం…: దూర ప్రాంతాల నుంచి బంధువులు నేరుగా సిగాచి పరిశ్రమకు వస్తున్నారు.
అక్కడి నుంచి వారిని పోలీసులు పంపిస్తుండడంతో హెల్ప్‌డెస్క్‌కు వచ్చి తమవారి జాడ కోసం అడుగుతున్నారు. వారికి ఫోన్లలో మృతదేహాల ఫొటోలను అధికారులు చూపించి నిర్ధారించే ప్రయత్నం చేస్తున్నారు. డీఎన్ఏ టెస్టులు చేయించుకున్న రక్తసంబంధీకుల వివరాలు రాసుకుని పంపిస్తున్నారు. మరో పక్క దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి వసతి, భోజనం ఇతర సౌకర్యాలను అధికారులు కల్పిస్తున్నారు. వారు ఇతర రాష్ర్టాలకు వెళ్లడానికి వాహనాలు సమకూరుస్తున్నారు. ఇస్నాపూర్ వైకుంఠధామంలో ఇప్పటికి మూడు మృతదేహాలకు దహన సంస్కారం నిర్వహించారు.
పాశమైలారంలో వైకుంఠధామంలోనూ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ముస్లిం సంప్రదాయ వ్యక్తికి ఇంద్రేశంలోని ఖబ్రస్థాన్‌లో ఖననం నిర్వహించారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పోస్టుమార్టం, డీఎన్ఏ టెస్టులు పూర్తి చేసుకున్న మృతదేహాలకు, గుర్తించిన మృతదేహాలకు అంత్యక్రియల ఏర్పాట్లు చేశారు. పంచాయతీరాజ్, మున్సిపల్‌శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. సామూహిక ఖననాలు చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. డీఎన్ఏ పరీక్షల ఫలితాలు వస్తే బంధువుల కోరిక మేరకు ఇక్కడే అంత్యక్రియలు చేస్తారు.