మెదక్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకోవడంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. కలుషిత నీరు, ఆహారం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. జ్వర బాధితులతో సర్కారు దవాఖానలు కిటకిటలాడుతున్నాయి. మెదక్ జిల్లాలోని జిల్లా కేంద్ర దవాఖానతోపాటు నర్సాపూర్ ఏరియా దవాఖాన, తూప్రాన్, రామాయంపేట, కౌడిపల్లి పీహెచ్‌సీల్లో రోగులు బారులుతీరుతున్నారు. జిల్లాలోని దవాఖానల్లో మందులు, సూదుల కొరతతో రోగులు బయట కొనుగోలు చేయాల్సి వస్తుంది.
మెదక్ జిల్లాలోని కౌడిపల్లి పీహెచ్సీలో నర్సింగ్ సిబ్బందితోనే చికిత్స అందిస్తున్నారు. ఈ పీహెచ్సీలో మూడు నెలలుగా మందులు అందుబాటులో లేవు. రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ అందుకు తగ్గట్టుగా సేవలు అందించలేకపోతున్నారు. రోగులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తామని చెబుతున్న వైద్యాధికారులు వారిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. జూన్‌లో 148 మంది జ్వరంతో బాధపడుతున్న వారికి చికిత్సలు చేయగా, జూలైలో 57 మంది టైఫాయిడ్ బాధితులకు వైద్యం అందించారు. తూప్రాన్ ప్రభుత్వ దవాఖానలో సూదుల కొరత తీవ్రంగా ఉంది. దవాఖానకి వచ్చే రోగులకు మందు లు అందుబాటులో లేవు. రోగులకు మందు లు ఇవ్వాలంటే బయట కొనుగోలు చేసి ఇస్తున్నారు. ఈ పీహెచ్సీలో జూన్‌లో 176 మందికి రక్త పరీక్షలు చేయగా, 78 మందికి టైఫాయిడ్ పాజిటీవ్‌గా వచ్చిం ది. జూలైలో ఇప్పటి వరకు 156 మందికి పరీక్షలు చేయగా, 67 మందికి పాజిటీవ్ అని తేలింది.
రామాయంపేట సర్కారు దవాఖానలో సీజనల్ వ్యాధుల కారణంగా రోగుల తాకిడి పెరుగుతోంది. రామాయంపేట మండలంతోపాటు నిజాంపేట్, చిన్నశంకరంపేట మండలాల పరిధిలోని ఆయా గ్రామాల నుంచి ప్రజలు దవాఖానకు వస్తున్నారు. ఈ నెలలో ఇప్పటివరకు 56 మంది మలేరియా బారినపడ్డారు.
మెదక్ జిల్లాలో డెంగీ, ఇతర విష జ్వరాల నివారణకు పరిసరాల పరిశుభ్రతే ప్రధాన కారణం. గ్రామా ల్లో పారిశుధ్య చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. బావుల్లో, మురుగు కాలువల్లో క్లోరినేషన్ చేయాలని ఆదేశాలు ఉన్నా ఎక్కడా కనబడడం లేదు. పల్లెల్లో పారిశుధ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. దీనికితోడు సర్పంచ్ల పదవీకాలం ముగిసిన తర్వాత ప్రత్యేకాధికారుల పాలనలో పల్లెలు మరీ దారుణంగా తయారయ్యాయి.
మెదక్ జిల్లాలోని ఆయా దవాఖానల్లో 46 మంది డాక్టర్ల కొరత ఉన్నది. అయినా రోగులకు వైద్య సేవలు అందిస్తున్నాం. వాతావరణం లో మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. సర్కారు దవాఖానల్లో చికిత్స అం దిస్తాం. రోగులకు మెరుగైన వైద్యం అందించడమే మా లక్ష్యం.