సిద్దిపేట, సెప్టెంబర్ 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకూ అసంతృప్తి జ్వాల రగులుతోంది.అధికారంలోకి వచ్చిన తొలుతలో ఉన్న ఉత్సాహం ప్రస్తుతం పార్టీ క్యాడర్లో కనిపించడం లేదు. జిల్లాకు చెందిన మంత్రులు పార్టీ క్యాడర్‌ను పట్టించుకోవడం లేదన్న విమర్శలు బలంగా ఉన్నాయి. వారి సొంత నియోజకవర్గాలకే పరిమితమవుతూ ఇతర నియోజకవర్గాల పార్టీ నేతలను,కార్యకర్తలను పట్టించుకోవడం లేదని బహిరంగ విమర్శలు చేస్తున్నారు.నామినేటెడ్ పదవులు ఊరించుడు తప్పా..ఇంత వరకు పంపకాలు లేవు.
దీంతో క్యాడర్ నైరాశ్యంలో అలుముకుంది.అధికారంలోకి రాక ముందు చెప్పిన మాటలు ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదని సొంత పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రధానంగా రైతులకు పంట రుణమాఫీ అసంపూర్తిగానే చేయడంతో సొంత పార్టీ నేతలు ప్రభుత్వ తీరును ఎండ గట్టారు.రైతులకు సకాలంలో ఎరువులు సరఫరా చేయకపోవడంతో యూరియా కొరత రైతులను వేధిస్తున్నది. నిత్యం జిల్లాలో రైతులు యూరియా కోసం కొట్టుకుంటున్నారు.
సన్నాల బోనస్ ఇంత వరకు రైతుల ఖాతాలో జమ కాలేదు. ఇందిరమ్మ ఇండ్లు అంతే సంగతులు…ప్రభుత్వం పెట్టిన కొర్రీలతో చాలామంది ఇండ్లు నిర్మించుకోవడానికి ముందుకు రావడం లేదు. వృద్ధ్దులకు పింఛన్ పెంచలేదు. ఇలా ఎన్నో పథకాలు అమలు చేయాల్సి ఉన్నప్పటికీ అమలు చేయడం లేదు. ఫలితంగా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత పెరుగుతున్నది. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగలడం ఖాయం అని సొంత పార్టీ నేతలు బాహాటంగానే పేర్కొంటున్నారు. అధికారంలో ఉన్నమాటే కానీ, ఒక్క రూపాయి పనిచేసింది లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు ఉన్నా కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
మంత్రి దామోదర తన సొంత నియోజకవర్గం అందోల్‌కు పరిమితం కాగా, ఇక రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన కరీంనగర్ జిల్లాపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఫలితంగా జిల్లా క్యాడర్‌ను పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. మంత్రి పొన్నం హుస్నాబాద్‌కు వెళ్లినా అక్కడా కరీంనగర్ నేతల పెత్తనం ఉంటున్నదని, అక్కడ కూడా దగ్గరికి రానివ్వడం లేదని నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్‌కు, ఇతర మంత్రులకు పొసగడం లేదన్న విమర్శలు బలంగా ఉన్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గాలు అధికంగానే ఉన్నాయి. ఎవరి వర్గం వారే చూసుకుంటున్నారు. ఏ వర్గంలో లేని నాయకుడు, కార్యకర్త అంతే సంగతి. వర్గాలుగా విడిపోవడంతో ఏ వర్గంలో లేని నాయకులు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపులకు పెట్టింది పేరు అని చెప్పాలి. సిద్దిపేట నియోజకవర్గంలో పూజల హరికృష్ట ఇన్చార్జిగా ఉన్నారు. ఈయన్ను మెజార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. సీనియర్ నేతలు ఒక్కరు కూడా ఈయన నాయకత్వంలో పని చేయడానికి ఇష్టపడడం లేదు. సీనియర్ నేతలంతా ఎవరికి వారే ఉన్నారు. గంప మహేందర్, తాడూరి శ్రీనివాస్‌గౌడ్, దరిపల్లి చంద్రం,గూడూరి శ్రీనివాస్ తదితర నేతలు ఉన్నారు.
వీరంతా ఎవరికి వారే వర్గంగా చలామణి అవుతున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వర్గాలుగా ఇక్కడ నేతలు విడిపోయి ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రచ్చకెక్కుతున్నారు.పెద్ద నేతలు వారి వారి వర్గాలను పోషించు కుంటున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్ రెడ్డితో పాటు మరికొంత మంది నేతలు గ్రూపులుగా విడిపోయి ఉన్నారు. ఇక్కడ రెండు గ్రూపులు బలంగా ఉన్నాయి . గజ్వేల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు వర్గాలు బలంగా ఉన్నాయి. ఇక్కడ రెండు వర్గాలుగా చీలిపోయింది.
నామినేటెడ్ పదవులు ఆశించినా దక్కడం లేదు. కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తూంకుంట నర్సారెడ్డిపై జిల్లాలోని నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో మెదక్ డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి ఎవరికీ వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా మూడు గ్రూపులు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, సుహాసనిరెడ్డిలు ఒక వర్గంగా, రాజిరెడ్డి, ఆంజనేయులు చెరో వర్గంగా నియోజకవర్గంలో చలామణి అవుతున్నారు.మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌పై పార్టీ క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది. నాయకులను, క్యాడర్‌ను ఆయ న పట్టించుకోవడం లేదని సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు.
ఎమ్మెల్యే తీరు నచ్చక ఇటీవల పలువురు బీఆర్ఎస్లో చేరారు. నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే , ఎంపీ రెండు వర్గాలుగా పార్టీ క్యాడర్ చీలిపోయింది. ఇక్కడ ఎవరికి వారే అన్న తీరుగా ఉంది. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి తీరుపై క్యాడర్ గుర్రుగా ఉంది. ఒంటెత్తు పోకడలతో పార్టీ క్యాడర్ నారాజ్‌గా ఉంది. జహీరాబాద్ నియోజకవర్గంలో అంతంతే అని చెప్పాలి. ఆందోల్ నియోజకవర్గంలో మంత్రి రాజనర్సింహపై కార్యకర్తలు అసహనంతో ఉన్నారు. తమకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో మూడు ముక్కలాటగా పార్టీ మారింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, కాట శ్రీనివాస్ గౌడ్, నీలం మధు క్యాడర్ మూడు గ్రూపులుగా విడిపోయింది. ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో ఇక్కడ గ్రూపులుగా బలంగా ఉండి ఎవరికి వారే తమ ప్రచారాన్ని చాపకింద నీరు చేసుకుంటున్నాయి. గాలి అనిల్‌కుమార్ సైతం తన గ్రూపును పెంచుకుంటున్నారు.
సొంత పార్టీ నేతలపై గాంధీభవన్‌కు రోజురోజుకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఎవరికి వారే గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు గాంధీభవన్‌లో ఫిర్యాదులు చేసుకుంటున్నారు.ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతున్నది. వర్గపోరు రోజుకు పెరుగుతున్నది. ఇటీవల సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డికి, సిద్దిపేట నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి పూజల హరికృష్ణకు పార్టీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గజ్వేల్ పట్టణంలో జరిగిన రేషన్ కార్డుల పంపణీ సందర్భంగా జరిగిన గొడవలో ఒకరి నొకరు దూషించుకున్నారు.
ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్ పోలీస్ స్టేషన్లో నర్సారెడ్డిపై ఫిర్యాదు చేశారు.దీంతో పాటు సిద్దిపేట, జగదేవ్‌పూర్‌లో జరిగిన సంఘటనలు ఉన్నాయి. గత ఆదివారం పార్టీ క్రమ శిక్షణ కమిటీ నర్సారెడ్డిని పిలిచి షోకాజ్ నోటీస్ జారీ చేసింది.ఇక సిద్దిపేట పార్టీ ఇన్చార్జి పూజల హరికృష్ణపై సొంత పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.కమీషన్లు తీసుకుంటున్నాడని, పార్టీ కోసం పని చేసిన క్యాడర్‌ను గుర్తించడం లేదని పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో పార్టీ క్రమశిక్షణ కమిటీ అతనికి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రోజు రోజుకు మరింతగా ముదురుతూ పార్టీని పలుచన చేస్తున్నది.