దుబ్బాక, ఫిబ్రవరి 9: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట-భూంపల్లి మండలంలోని రామేశ్వరంపల్లిలో ఉన్న కూడవెల్లి రామలింగేశ్వరాలయం భక్తజనసంద్రమైంది. మాఘ అమావాస్య సందర్భంగా శుక్రవారం వేకువజాము నుంచే త్రివేణి సంగమంలో (కూడవెల్లి వాగులో) భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం రామలింగేశ్వరుడిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లానే కాకుండా కామారెడ్డి, రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలతోపాటు మహారాష్ట్ర నుంచి భక్తులు భారీసంఖ్యలో తరలివచ్చారు. దుబ్బాక , సిద్దిపేట, కామారెడ్డి ఆర్టీసీ డిపోల నుంచి కూడవెల్లి జాతరకు అధికారులు ప్రత్యేకంగా బస్సులు నడిపించారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు ధర్మ దర్శనంతోపాటు ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేశారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి ఆలయం వద్ద భక్తుల రద్దీ పెరిగింది.
దీంతో పోలీసు, దేవాదాయశాఖ అధికారులు దైవ దర్శనానికి మరిన్ని వరుసలు ఏర్పాటు చేశా రు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చలువ పందిళ్లు, తాగునీటి వసతి కల్పించారు. ఆరోగ్యకేంద్రం, పోలీసు సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సీసీ కెమెరాలతో పాటు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆల యం వద్ద మరో నాలుగు రోజులపాటు పెద్ద ఎత్తున జాతర కొనసాగనున్నది. రామలింగేశ్వరాలయం వద్ద దుబ్బాక సీఐ శ్రీనివాస్ నేతృత్వంలో దుబ్బాక, భూంపల్లి ఎస్సైలు, పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు లక్షకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈవో విశ్వనాథశర్మ, చైర్మన్ చంద్రం తెలిపారు. కూడవెల్లి రామలింగేశ్వరుడిని దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పలతాకిషన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శేర్ల కైలాష్ దర్శించుకున్నారు.