వైకుంఠ పురనివాసా.. మనసాస్మరామి.., గోవిందా గోవిందా అంటూ విష్ణు నామావళితో ఉమ్మడి జిల్లాలోని వైష్ణవాలయాలు మార్మోగాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం జిల్లావ్యాప్తంగా వేంకటేశ్వరస్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉదయం 4 గంటల నుంచే భక్తులు పెద్దసంఖ్యలో ఉత్తర ద్వారం నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు బారులుదీరారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో ధర్మ దర్శనానికి రెండు నుంచి మూడు గంటల సమయం పట్టింది. మంత్రులతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు స్వామివారిని దర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల కమిటీల ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తుల కోసం అన్నదానాలు చేశారు.
మెదక్ మున్సిపాలిటీ/ మెదక్ రూరల్/ పెద్దశంకరంపేట/ అల్లాదుర్గం/ రామాయంపేట/ నిజాంపేట/ చేగుంట/ నర్సా పూర్/ కొల్చారం/ వెల్దుర్తి, జనవరి 23 : క్షీరసాగర మధనం జరిగి అమృతం, విషం వెలువడిన రోజు ఏకాదశి. ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం తెరుచుకొని ఉంటుందని.. శ్రీహరిని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలు దర్శనానికి వెళ్లిన రోజు. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారంగా శ్రీహరిని దర్శించుకుంటే భక్తుల కోర్కెలు నెరవేరుతాయని శాస్ర్తోక్తి. ముక్కోటి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని మెదక్ జిల్లాలోని వైష్ణవ, ఇతర ఆలయాల్లో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ ప్రాంగణాలు పుష్పాలంకరణతో కొత్త శోభను సంతరించుకున్నాయి. జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయం, వేంకటేశ్వర ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి దర్శనం చేసుకున్నారు. ముఖ్యంగా మహిళలు ఉత్తర దర్శనానికి బారులు తీరారు. ఉత్తర దర్శనం అనంత రం ఆలయాల్లో స్వామివారికి పల్లకీసేవ నిర్వహించి, ప్రత్యేక పూజలు, ఫుష్పార్చన చేశారు. ఆయా పూజా కార్యాక్రమాల్లో ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి దంపతులు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తోపాటుజడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ దంపతులు, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ దంపతులు, మాజీ వైస్ చైర్మన్ అశోక్ దంపతు లు, కౌన్సిలర్లతోపాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పేరురూ గరుఢగంగ సరస్వతీ ఆలయంలో పూజలు నిర్వ హించారు. పెద్దశంకరంపేటలోని వేంకటేశ్వర, వేణుగోపాల, విఠలేశ్వర, రామాలయాల్లో ఉత్తర దర్శనాలు చేపట్టారు. అల్లాదుర్గం, రామాయంపేట, నిజాంపేట, చేగుంట, నర్సాపూర్, కొల్చారం, వెల్దుర్తి మండలాల్లోని ఆలయాల్లో భక్తులు, ప్రజా ప్రతినిధులు భక్తిశ్రద్ధలతో ఏకాదశి వేడుకలు నిర్వహించారు.