చేర్యాల, మార్చి 29: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలోని ఒక్కో ప్రదేశానికి ఒక్కో చరిత్ర, ప్రత్యేకత ఉంది.అందులో స్వామి వారి అభిముఖానికి ఎదురుగా మండపం ముందు భాగంలో ఉన్న గంగరేగు చెట్టు భక్తుల పాలిట కల్పవృక్షంగా భావిస్తారు. స్వామివారి మహిమ మూలంగానే గంగరేగు చెట్టు ఏడాది పొడవునా పచ్చదనంతోనే ఉంటుందని భక్తులు నమ్ముతారు. వాతావరణంలో మార్పులు వచ్చినప్పటికీ గంగరేగు చెట్టు మాత్రం అన్నికాలాల్లో పచ్చదనంతో ఉట్టి పడుతుంటుంది.స్వామి వారి క్షేత్రానికి వచ్చిన భక్తులు గంగరేగు చెట్టు వద్ద ప్రదక్షిణలు చేసి, తమ కోరికలు తీర్చాలని మొక్కుకుంటారు. మరికొందరు భక్తులు గంగరేగు చెట్టు వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇనుప జాలీలకు ముడుపు కట్టి కోరిక తీరాలని దేవుడికి మొక్కుకుంటారు.
నిత్యం వేలాదిగా భక్తులు పూలదండలను చెట్టుకి విసిరివేస్తున్నారు.దీంతో ఎంతో పవిత్రమైన గంగరేగు చెట్టుకు రక్షణ లేకుండా పోతున్నది. స్వామి వారి ఆలయానికి బ్రహ్మోత్సవాల సమయంలో భారీ గా భక్తులు తరలి వస్తా రు. ఈ సమయంలో వారు గంగరేగు చెట్టు పై పూలదండులు వేస్తున్నారు.ఒక్కో భక్తుడు ఒక్కో పూలదండ.. ఇలా వంద లు, వేలల్లో భక్తు లు పూలదండలు గంగరేగు చెట్టు పైకి విసిరి వేస్తున్నారు. మోతాదు మించి చెట్టుపై పూలదండలు పడుతుండడంతో కొమ్మలు విరిగిపోతున్నాయి. దీంతో గంగరేగు చెట్టు సంరక్షణపై ఆలయవర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
ప్రకృతి ధర్మం మేరకు వాతావరణ మార్పులకు అనుగుణంగా చెట్లు ఆకులు రాల్చడం, తిరిగి ఆకులు రావడం జరుగుతుంటాయి. కానీ, కొమురవెల్లి క్షేత్రంలోని గంగరేగు చెట్టు అసలు ఎప్పుడు ఆకుల రాలుస్తుందో, ఎప్పుడు కొత్త ఆకులు రూపం దాలుస్తాయో తెలయకుండానే జరిగిపోతాయి. నిరంతరం భక్తులు రావడం, మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంటాయి. గంగరేగు చెట్టు సైతం అదే పద్ధతిలో ప్రకృతి ధర్మాన్ని కొనసాగిస్తున్నదని ఆలయవర్గాలు వెల్లడిస్తున్నాయి.
స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు పూలదండలు సమర్పించుకున్న విధంగా, గంగరేగు చెట్టు వద్ద సైతం భక్తులు పూలదండ తీసుకువచ్చి చెట్టు పైన వేసి దండం పెట్టుకుంటున్నారు. దండ లు చెట్టు పైకి విసరడం నిలిపివేసి, అక్కడే పెట్టి భక్తులు మొక్కులు చెల్లించుకునేలా చర్యలు తీసుకుంటే చెట్టుకు ఎలాంటి ముప్పు ఉందని పలువురు భక్తులు చెబుతున్నారు.గంగరేగు చెట్టు చుట్టూ ప్రస్తుతం స్టీల్ రేలింగ్ ఉంది. ఇదే నిర్మాణానికి మరింత పైకి పెంచితే చెట్టు పైకి భక్తులు దండ విసిరినా, దానిపై పడకుండా పక్కన పడుతుందని, వెంటనే ఆలయవర్గాలు స్టీల్ రేలింగ్ను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.
బ్రహ్మోత్సవాల సమయంలో గంగరేగు చెట్టు వద్దకు వెళ్లి మొక్కుకోవాలనుకున్నా, మొక్కు తీర్చుకోవాలనుకున్నా రద్దీతో భక్తులు ఆ ప్రదేశానికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ఆ సమయంలో అక్కడ ఓ అర్చకుడిని నియమించి, అక్కడ హుండీ ఏర్పాటు చేస్తే ఆదాయం వచ్చే ఆవకాశం ఉంది.ప్రస్తుతం చెట్టు ప్రదేశంలో అనుమతి లేకుండా ఇతర వ్యక్తులు తిష్ట వేసుకొని వచ్చిన భక్తులకు బొట్టు పెట్టి, కొబ్బరికాయ కొట్టి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు.
ఆలయవర్గాలు ఏర్పాటు చేసిన చిన్న హుండీలో భక్తులు కానుకలు వేస్తే, అవి లోపలికి వెళ్లకుండా అడ్డుగా బట్టలు పెట్టి డబ్బులు కొల్లగొడుతున్నారు.మల్లన్న ఆలయ అధికారు ప్రత్యేక దృష్టిసారించి గంగరేగు చెట్టు ప్రత్యేక రక్షణ చర్యలతో పాటు వసతులు కల్పిస్తే భక్తుల మొక్కులకు తిప్పలు తప్పడంతో పాటు స్వామి వారి ఖజానాకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది.