వర్గల్, సెప్టెంబర్ 24: సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యాధరి క్షేత్రంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సరస్వతీమాత అన్నార్థులకు ఆకలి తీర్చే అన్నపూర్ణదేవిగా కొలువుతీరి భక్తులకు దర్శనమిచ్చారు. పూజా కార్యక్రమాల్లో భక్తులు భారీగా పాల్గొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం అమ్మవారిని దర్శించుకున్నారు. వర్గల్ విద్యాదరి క్షేత్రం దేశంలోనే ఆడబిడ్డలందరికీ గొప్ప ఆశీర్వచనం ఇచ్చే ఇలవేల్పుగా ప్రసిద్ధికెక్కిందని ఆమె అన్నారు. ఆలయ నిర్వాహకులు కవితకు ఘనస్వాగతం పలికారు.
పాపన్నపేట, సెప్టెంబర్ 24: మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వన దుర్గాదేవి సన్నిధిలో శరన్నవ రాత్రుల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు బుధవారం చంద్రఘంటాదేవి(అన్నపూర్ణ)గా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
భక్తులు అమ్మవారికి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పురోహితుడు రాజేశ్శర్మ, పూజారులు శంకర్శర్మ, పార్థివశర్మ గణపతి పూజ, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. రాజగోపురం వద్ద ఉత్సవ విగ్రహానికి కుంకుమార్చనలు చేశారు.