జహీరాబాద్, నవంబర్1: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో ఏర్పాటు చేస్తున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)లో ప్రపంచ, జాతీయ స్థాయి పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని కల్సిస్తూ, పెట్టుబడులను అకర్షించే విధంగా, ఔత్సాహికులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషిచేసిన సంగతి తెలిసిందే. జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో నిమ్జ్ ప్రాజెక్టు కోసం 12,635 ఎకరాల భూములను సేకరించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి, రెండో విడతలో కలిపి 8 వేల ఎకరాల భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించింది. మొదటి విడతలో సేకరించిన 3,245 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్న పారిశ్రామిక వాడ పనులను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో వ్యాపారులు, స్థానిక సంస్థలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు.
మొదటి విడత సేకరించిన భూముల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. 2024 జూలైలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడర్ డెవప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (ఎన్ఐసీడీఐటీ) తన 14వ బోర్డు సమావేశంలో అఫ్య్రూవల్ చేసింది. 2024 ఆగస్టులో కేంద్ర కేబినెట్ అనుమతించింది. కేంద్ర ప్రభుత్వ వాటా 49శాతం, రాష్ట్ర ప్రభుత్వం వాటా 51 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టనున్నాయి. దాదాపు రూ. 2,369 కోట్లతో నిమ్జ్ ప్రాజెక్డు కోసం మొదటి విడత సేకరించిన 3,245 ఎకరాల భూముల్లో రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడర్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంట్ ట్రస్టు కలిసి పారిశ్రామిక అభివృద్ధి పనులు చేపట్టనున్నాయి. దీని కోసం అక్టోబర్‌లో టెండర్లు ఖరారయ్యాయి.
అర్హత కలిగిన సంస్థలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కావాల్సిన అభివృద్ధి పనులు చేసి అప్పగించేందుకు ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధిలో భాగంగా ఆయా మండలాల్లోని గ్రామాల పరిధిలో లేఔట్ అభివృద్ధి, ఇంటర్నెట్, రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు, పార్కులు తదితర మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోనున్నారు. ఆయా పనులను నవంబర్‌లో ప్రారంభం కానున్నాయి. దీని కోసం రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంట్ ట్రస్టు ఏర్పాట్లు చేస్తున్నాయి.
ఇటీవల టీజీఐఐసీ ఎండీ శశాంక్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఇతర అధికారులు ఝరాసంగం మండలంలోని ఆయా గ్రామాల్లో మొదటి విడతలో సేకరించిన భూములను పరిశీలించారు. వెంటనే సేకరించిన భూములకు ఫెన్సింగ్ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఇందులో ఆటోమొబైల్ తయారీ, విద్యుత్ పరికరాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యంత్రాలు, లోహ తదితర పరిశ్రమలు నెలకొల్పనున్నారు. తద్వారా 1.98 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.
ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసే పారిశ్రామిక వేత్తలకు, ముడిసరుకు దిగుమతి, తయారీ వస్తువులను ఎగుమతి చేసేందుకు నిమ్జ్ ప్రాంతానికి ప్రత్యేక రోడ్డు మార్గాన్ని జాతీయ రహదారి ముంబయి-65 అనుసంధానంగా బీఆర్ఎస్ హయాంలో నిర్మించారు. ఈ ప్రాంతానికి హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 125 కిలోమీటర్లు, కర్ణాటకలోని బీదర్‌కు 30 కిలోమీట్లర్ల దూరంలో విమానాశ్రయాలు ఉన్నాయి. జవహర్లాల్ నెహ్రూ పోర్టు ట్రస్టు 600 కిలోమీటర్లు, కృష్ట పట్నం పోర్టుకు 465 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. నిమ్జ్ ప్రాజెక్టులో ఏర్పాటు కానున్న పరిశ్రమలను దృష్టిలో పెట్టుకుని జహీరాబాద్ ప్రాంతం మీదుగా హైదరాబాద్-ముంబయి హైస్పీడ్ బుల్లెట్ రైలును నడిపించేందుకు రైల్వేశాఖ ప్రతిపాదనలు రూపొందిస్తున్నది. జహీరాబాద్ ప్రాంతంతో పాటు ఆయా మండలాలు సామాజిక ఆర్థికాభివృద్ధికి నిమ్జ్ ఎంతగానో దోహదపడే అవకాశం ఉంది.