సంగారెడ్డి, జనవరి 25(నమస్తే తెలంగాణ): జెండా వందనంతో జిల్లాలోని మున్సిపాలిటీ పాలకవర్గాల పదవీకాలం ముగియనున్నది. పంచాయతీలు ఇది వరకే ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లగా, 27వ తేదీ నుంచి మున్సిపాలిటీల్లోనూ ప్రత్యేకాధికారుల పాలన ప్రారం భం కానున్నది. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, సదాశివపేట, నారాయణఖేడ్, అందోలు-జోగిపేట, బొల్లారం, అమీన్పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీల్లో చైర్మన్ల పదవీకాలం ఆదివారంతో ముగుస్తుంది. 2020 జనవరిలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 27 జనవరి, 2020 ఎనిమిది మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువు దీరాయి. ఐదేండ్ల మున్సిపల్ పాలక వర్గాల పదవీకాలం నేటితో ముగియనున్నది.
మున్సిపల్ ఎన్నికల్లో ఎనిమిది మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలోని మున్సిపాలిటీల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా మున్సిపాలిటీలు అభివృద్ధి బాటపట్టాయి. బీఆర్ఎస్ హయాంలో జిల్లా మంత్రిగా ఉన్న హరీశ్‌రావు మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులతో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చారు. సంగారెడ్డి జిల్లాలోని 8 మున్సిపాలిటీల్లో రూ.250 కోట్ల ప్రత్యేక నిధులతో అభివృద్ధి పనులు చేయంచారు. రూ.10కోట్లతో శ్మశాన వాటికల్లో ఆధునిక వసతులు కల్పించి వైకుంఠధామాలుగా అభివృద్ధి చేశారు. రూ. 38.50 కోట్లతో ప్రతి మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ వెజ్,నాన్‌వెజ్ మార్కెట్లను కేసీఆర్ ప్రభుత్వం నిర్మించింది. రూ. 82.59 కోట్లతో అర్బన్ మిషన్ ద్వారా జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తున్నది.
నారాయణఖేడ్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ హయాంలో రూ.25 కోట్ల ఎస్డీఎఫ్ నిధులు, రూ.15 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులు, రూ.25 కోట్ల రూర్బన్ నిధులు, రూ.11 కోట్ల స్టార్టప్ నిధులు బీఆర్ఎస్ సర్కార్ ఖర్చు చేసింది. బొల్లారం మున్సిపాలిటీల్లో రూ.150 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. రూ.25 కోట్ల సీఎం ప్రత్యేక నిధులతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు నిర్మించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో మున్సిపాలటీలో వీధిలైట్లు, పబ్లిక్ టాయిలెట్లు నిర్మించింది. తెల్లాపూర్ మున్సిపాలిటీలో రూ.102 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. రూ.25.91 కోట్లతో సీసీ రోడ్లు, రూ.14.49 కోట్లతో డ్రైనేజీ నిర్మాణ పనులు, రూ.47.10 కోట్ల ఎంజీఎఫ్ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టింది.
సదాశివపేట మున్సిపాలిటీలో రూ.150 కోట్లతో బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి పనులు జరిగాయి. సంగారెడ్డి మున్సిపాలిటీలో సుమారు రూ.300 కోట్ల పైగా నిధులతో అభివృద్ధి పనులు చేశారు. సంగారెడ్డి పట్టణంలో సెంట్రల్ మీడియన్ ఏర్పాటుతో పాటు సీసీరోడ్లు, డ్రైనేజీలు నిర్మాణ పనులు బీఆర్ఎస్ హయాంలో చేపట్టారు. అందోలు మున్సిపాలిటీ అభివృద్ధ్దికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.300 కోట్లు ఖర్చు చేసింది. అమీన్పూర్ మున్సిపాలిటీలో రూ. 456 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టింది. దీంతో బల్దియాల రూపురేఖలు మారాయి.