గజ్వేల్, మార్చి 11: పదేండ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ నాయకులు రెట్టింపు చేసి చూపించాలని, బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని రెట్టింపు చేసి చూపించాలి గానీ, చేతకాక బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదన్నారు. పదేండ్లలో ప్రజలను కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకున్నారని, 15 నెలల కాలంలోనే ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరక్తి వచ్చిందన్నారు.
కాంగ్రెస్ నాయకులు కేసీఆర్, హరీశ్‌రావులపై విమర్శలు చేయడం పనిగా పెట్టుకున్నారు కానీ, అమలుకాని 420 హామీలపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. సిద్దిపేట జిల్లాలోని ప్రాజెక్టుల ద్వారా మండుటెండల్లో సైతం చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు నింపి గుంట కూడా ఎండిపోకుండా రైతుల ముఖాల్లో సంతోషం నింపిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కండ్ల ఎదుటే రైతుల పొలాలు, చెరువులు, కుంటలు ఎండిపోతున్నా పట్టించుకోకుండా కేసీఆర్, హరీశ్‌రావులపై విమర్శలు చేయ డం సిగ్గుచేటన్నారు. రైతులు సాగునీళ్ల కోసం ఎదురుచూస్తున్నారని, తక్షణమే సాగునీళ్లు అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం కోసం రూ.180కోట్ల నిధులు మంజూరు చేస్తే అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం గజ్వేల్ అభివృద్ధిని తుంగలో తొక్కిందన్నారు. గజ్వేల్‌లో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. సీఎం రేవంత్ ఇక్కడి నుంచి తీసుకెళ్లిన నిధులు, పెండింగ్ పనులపై స్థానిక కాంగ్రెస్ నాయకులు మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆర్అండ్ఆర్ కాలనీలో మిగిలిన 10శాతం పనులకు వెంటనే రూ.100కోట్లు మంజూరు చేసి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.