సిద్దిపేట,జూలై 12: బీఆర్ఎస్ హయాంలోనే సిద్దిపేట నియోజకవర్గంలో అనేక ఆలయాలను అభివృద్ధి చేసుకున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా సిద్దిపేట నియోజకవర్గంలోని నాలుగు ఆలయాలకు రూ.కోటీ 48 లక్షలు మంజూరు కాగా ఆపత్రాలను ఆలయాల ప్రతినిధులు, గ్రామస్తులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేట నియోజకవర్గంలో అనేక ఆలయాలు మంజూరు చేసుకున్నామని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఆలయాలను అభివృద్ధి చేసుకున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు మంజూరు చేయించినట్లు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆలయాలకు పూర్వ వైభవం వచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడుస్తున్నా ఒక కొత్త ఆలయానికి నిధులు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో రాజ్‌గోపాల్‌పేట శివాలయానికి రూ.35లక్షలు, అనంతసాగర్ బీరప్ప దేవాలయానికి రూ.32 లక్షలు,రాఘవాపూర్ సీతారామచంద్రస్వామి ఆలయానికి రూ. 36 లక్షలు, రావురూకుల వేంకటేశ్వరస్వామి దేవాలయానికి రూ. 50లక్షలు మంజూరైనట్లు చెప్పారు. త్వరలోనే టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించేలా కృషి చేస్తానని చెప్పారు.
రేవంత్‌కు మాటలెక్కువ.. చేతలు తక్కువ
సీఎం రేవంత్‌కు మాటలెక్కువ.. చేతలు తక్కువ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 167 మంది లబ్ధిదారులకు రూ.38 లక్షల 54 వేల విలువ చేసే సీఎం సహాయనిధి చెకులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి మోటర్లు ఆన్చేయకుండా రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. మహారాష్ట్రలో వర్షాలు పడుతుంటే ఇవాళ గోదావరినదిలో ఎనిమిది లక్షల క్యూసెకుల నీళ్లు పోతున్నాయన్నారు. గట్టిగా మోటర్లు ఆన్‌చేస్తే వారం రోజుల్లో రంగనాయకసాగర్ నిండిపోతుందని..అట్లా అన్ని రిజర్వాయర్లు నింపవచ్చన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ఆరోపణలు చేస్తున్నారని.. మేడిగడ్డ బ్రిడ్జి పైన లారీలు, మోటర్లు నడుస్తున్నాయన్నారు. అసెంబ్లీ పెట్టే దమ్ముం దా అని రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. కృష్ణనదిలోకి నీళ్లొచ్చి 36 రోజులైనా ఎందుకు కల్వకుర్తి మోటర్లు ఆన్చేయలేదన్నారు. కండ్లముందు నీళ్లు పోతున్నాయి కానీ రైతులకు నీళ్లు, రైతు బంధు ఇస్తలేడన్నారు. చెత్త బండ్లు వస్తలేవు సార్ అని ఆయా గ్రామాల ప్రజలు అడుగుతున్నారని గుర్తుచేశారు. కేసీఆర్ ట్రాక్టర్లు కొనిస్తే రేవంత్ అందులో డీజిల్ పోయించడానికి పైసలు లేవన్నారు. కేసీఆర్ హయాంలో కేసీఆర్ కిట్రాగా ఇప్పుడు అది కూడా బంద్ అయ్యిందన్నారు. సిద్దిపేట పిల్లల కోసం వెటర్నటీ డిగ్రీ కళాశాల తీసుకొస్తే రేవంత్‌రెడ్డి ఆకాలేజీని కొడంగల్‌కు తరలించుకుపోయాడని మండిపడ్డారు. మళ్లీ మన సిద్దిపేటకు పూర్వ వైభవం రావాలంటే, ప్రతిష్ట పెరగాలంటే కేసీఆర్ రావాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక ఆలయాల ఖిల్లా ..సిద్దిపేట జిల్లా
సిద్దిపేట అర్బన్, జూలై 12 : మనిషికి దైవ స్మరణ, గురుపూజలో ఉన్న సంతృప్తి, ఆనందం ఎందులో ఉండదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆధ్యాత్మిక ఆలయాల ఖిల్లా సిద్దిపేట జిల్లా అని ఆయన పేర్కొన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణ శివారులోని బైరి అంజయ్య గార్డెన్లో జరిగిన హనుమాన్ పీఠాధిపతి దుర్గాప్రసాద్‌స్వామి వారి గురుపూజోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సిద్దిపేటలో ఏ కార్యక్రమం అయినా సిద్ధిస్తుందని, కోటి హనుమాన్ చాలీసా పారాయణ సంకల్పం సిద్ధించాలన్నారు. దుర్గాప్రసాద్ స్వామీజీ కారణజన్ముడు అని.. హనుమాన్ భక్తుల రూపంలో హనుమంతుడిని విశ్వవ్యాప్తం చేయడానికి ఆయన జన్మించారన్నారు. ఆయన చేస్తున్న సేవల్లో సిద్దిపేట ప్రాంతానికి ప్రాధాన్యం ఇవ్వడం మనందరికీ గర్వకారణమన్నారు. ఆ పుణ్యం సిద్దిపేటకు కూడా దక్కుతుందన్నారు.
ప్రపంచంలో అత్యధిక హనుమాన్ మాలధారణ చేసే భక్తులు సిద్దిపేటలోని ఉన్నారని దుర్గాప్రసాద్ స్వామిజీ చెప్పారన్నారు. దీక్షా సమయంలో వేలాది మందికి, హనుమాన్ భక్తులకు 45 రోజుల పాటు నిత్యాన్నదానం చేస్తున్న ఘనత సిద్దిపేటకే దక్కుతుందన్నారు. తెలుగు రాష్ర్టాల్లో తెప్పోత్సవం నిర్వహించే ఘనత విజయవాడ తర్వాత సిద్దిపేటకే దక్కిందంటే అది దుర్గాప్రసాద్ స్వామీజీ వల్లనే అన్నారు. పాఠాలు ఎవరైనా చెబుతారని, కానీ జీవిత పాఠాలు కొందరే చెబుతారని.. ఆ కొందరిలో దుర్గాప్రసాద్ స్వామీజీ ఒకరని.. అలాంటి వ్యక్తిని గురువుగా భావించి సన్మానించుకోవడం తన అదృష్టమన్నారు. కోటి హనుమాన్ చాలీసా సిద్దిపేట నుంచి ప్రారంభం కావడం సంతోషమని, ఆ గొప్ప కార్యక్రమంలో అందరూరం భాగస్వాములమవుదామన్నారు.