చేగుంట, మే 21: పని చేసే ప్రభుత్వానికి అండగా ఉండి పార్టీని భారీ మోజార్టీతో గెలిపించుకోవాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే దుబ్బాకలో అనేక అభివృద్ధి జరుగుతున్నదని, సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని దేశంలోని ప్రజలు గర్విహిస్తున్నారని అన్నారు. ఆదివారం నార్సింగి మండల కేంద్రంలోని చంద్రరెడ్డి గార్డెన్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ పట్టణ కార్యకర్తల సమావేశంలో ఎంపీ, బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు సోలిపేట సతీశ్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పేదల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నారన్నారు.
రైతుల కోసం రైతు బంధుతో పెట్టుబడి, రైతు బీమా, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, 24 గంటల ఉచిత విద్యుత్, ప్రాజెక్టులు నిర్మించి కాల్వల ద్వారా సాగు నీరు అందిస్తున్నరన్నారు. ముదిరాజ్ కులస్తుల అభివృద్ధికి మత్స్య పరిశ్రమ ద్వారా చెరువుల్లో చేపల ఉత్పత్తి చేసి, జీవనోపాధి కల్పిస్తున్నారన్నారు. చేనేత, గీత, బీడి కార్మికులకు పింఛన్ సౌకర్యం కల్పించారన్నారు. పేద ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి అందజేస్తున్నామన్నారు. దళిత బంధుతో దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు రూ.10 లక్షలు అందజేస్తున్నారన్నారు. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికీ తాగునీరు, కేసీఆర్ కిట్టు, కంటి జబ్బులు నయం చేసేందుకు కంటి వెలుగు శిబిరాలు, బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూడోసారి తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వస్తున్నదని, ప్రతి కార్యకర్త పార్టీ కోసం పని చేసి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీతోనే నార్సింగి మండల ఏర్పాటు: సోలిపేట సతీశ్‌రెడ్డి
ఎన్నో ఏళ్ల నుంచి ఏర్పాటు కాని నార్సింగి మండలం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే ఏర్పాటైందని బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు సోలిపేట సతీశ్‌రెడ్డి తెలిపారు. మూడోసారి తెలంగాణ ప్రభుత్వం అధికారం కోసం ప్రతి కార్యకర్త, నాయకుడు పని చేస్తూ, ప్రభుత్వం చేస్తున్న పథకాలను గడపగడపకూ తీసుకుపోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో దుబ్బాక నుంచి లక్షా మెజార్టీతో గెలిపించుకునేందుకు కృషి చేయాలన్నారు.
ఎంపీ సమక్షంలో పలువురు చేరిక
ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి 20 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం బీఆర్ఎస్ సోషల్ మీడియా మండల కన్వీనర్ సుధీర్‌గౌడ్ పుట్టిన రోజు వేడుకల్లోఎంపీ, సోలిపేట సతీశ్‌రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చిందం సబిత, జడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మైలారంబాబు, వైస్ ఎంపీపీ దొబ్బల సుజాత, పట్టణశాఖ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎర్రం అశోక్, ఎంపీటీసీ సత్యనారాయణ, సొసైటీ చైర్మన్ శంకర్‌గౌడ్, రాష్ట్ర నాయకులు మనోహర్‌రావు, మామిడి మోహన్‌రెడ్డి, వెంకటనర్సింహరెడ్డి, మాజీ చైర్మన్ తౌర్యనాయక్, అంచనూరి రాజేశ్, ఎంపీటీసీ ఆకుల సుజాత మల్లేశంగౌడ్, ఎన్నం లింగారెడ్డి, రాజేందర్, జెట్టి స్వామి, మాజీ ఎంపీటీసీ సులోచన, కుమ్మరి నర్సింహులు, బిక్యానాయక్, చందుయాదవ్, భూపతి, యాదగిరి, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ
మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త కుమ్మరి నాగరాజు ఇటీవల మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున కార్యకర్త కుటుంబాన్ని ఆదుకుంటామని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.
చేగుంట మండలంలో ఎంపీ సుడిగాలి పర్యటన
చేగుంట మండలంలో ఎంపీ సుడిగాలి పర్యటన చేశా రు. వడియారంలో నిర్మిస్తున్న పెద్దమ్మ దేవాలయాన్ని పరిశీలించారు. రుక్మాపూర్ గ్రామంలో ఆటో యూనియన్ జెండాను ఆవిష్కరించి, ఆటో నిర్వాహకులకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఇబ్రహీంపూర్ సమీపం లో ధాన్యం లోడ్‌తో వెళ్తున్న లారీ నుంచి సంచులు పడిపోగా, ధాన్యం సక్రమంగా తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. బోనాల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు నాగులు తల్లి ఇటీవల మృతి చెందింది. గ్రామంలో మంగలి రాములు మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబాలను ఎంపీ పరామర్శించారు. ఆయనతో పలువురు నాయకులు ఉన్నారు.