సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 23: అసెంబ్లీ సమావేశాల్లో అంగన్వాడీల వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను సోమవారం ముట్టడించారు. అంతకుముందు కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. తీవ్రమైన ఎండను లెక్క చేయకుండా తమ సమస్యలు పరిష్కరించాలని నినదించారు. కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 70 వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు 50 ఏండ్లుగా సేవలందిస్తున్నారన్నారు.
వీరికి ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. 2023లో నిర్వహించిన 24 రోజుల సమ్మె కారణంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలుకాలేదని విమర్శించారు. వెంటనే ఈఎస్ఐ, పీఎఫ్ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రం తెచ్చిన ఎన్ఈపీ 2020 చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానించాలని, రాష్ట్రంలో ప్రీప్రైమరీ పీఏం విద్యను అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రావిటీ చెల్లించాలనే డిమాండ్ చేశారు. అనంతరం అంగన్వాడీల ధర్నా వద్దకు చేరుకున్న జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి లలితాకుమారికి వినతి పత్రం అందజేశారు.
అందుకు ఆమె సానుకూలంగా స్పందిస్తూ అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నేటి నుంచి అంగన్వాడీల్లో ఒక్కపూట సెలవు అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శశికళ, మంగ, నాయకురాళ్లు మంజుల, ఏసుమణి, నాగేశ్వరి, గౌరమ్మ, ఇందిరా, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.